ఆవేశం మంచిదే.. కానీ తూకం మిస్ అవుతోంది పవన్?

Update: 2021-10-02 16:30 GMT
ఎంత మంచి వంటకమైనా సరే.. కాసింత ఉప్పు తగ్గినా.. పెరిగినా దాని రుచి మొత్తానికి ఎఫెక్టు అవుతుంది. సూపర్ గా కుట్టేసిన ఒక షర్ట్ కు.. ఒక బటన్ అధికంగా పెట్టి.. వదిలేస్తే ఎలా ఉంటుంది? ఇలా దేనిలో అయినా సరే.. సమతూకం తప్పితే ఇబ్బందే. ఇంత చిన్న విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు మిస్ అవుతున్నారు. రాజకీయ అధినేతల్లో ఆవేశం మంచిదే. కానీ.. అది బ్యాలన్స్ ఉండాలి. కోపాన్ని ప్రదర్శించటం వేరు.. కోపంతో ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించటం వేరన్న విషయం తెలిసిందే.

ఆదివారం రాత్రి రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ప్రోగ్రాం సందర్భంగా సుదీర్ఘంగా మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ అధికారపక్షాన్ని ఉద్దేశించి తీవ్రంగా విరుచుకుపడటం ఒక ఎత్తు అయితే.. మధ్యలో ఒక అభిమాని స్టేజ్ మీదకు రావటంతో బ్యాలెన్సు మిస్ అయిన పవన్.. ఆవేశంతో ఊగిపోతూ అరుపులు.. కేకలు వేయటం కనిపిస్తుంది. తాము అభిమానించే నటుల విషయంలో కొంత ‘అతి’ని ప్రదర్శించే అభిమానులు పుష్కలంగా ఉంటారు. అలాంటి వారిని సముదాయించాలే తప్పించి.. ఇష్టం వచ్చినట్లుగా ఊగిపోతూ విరుచుకుపడటంలో అర్థం లేదు.

ఆ కార్యక్రమంలో అభిమాని విషయంలో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పవన్.. తాజాగా రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి తాను ప్రకటించిన శ్రమదానం వేళ.. పోలీసులు అడ్డుకోవటంపై ఆయన మండిపడ్డారు. తాను ప్రయాణించే వాహనం పైకెక్కి.. ఆవేశంతో ఊగిపోతూ.. చేతులు ఊపటం.. పెద్ద గా అరవటం లాంటివి చేశారు. ఇదంతా ఆయన ఏపీ పోలీసుల విషయంలో జరిగింది. రాజకీయ అధినేత ఆవేశం.. ప్రత్యర్థులకు సైతం గుబులు పుట్టేలా ఉండాలే తప్పించి.. ఏదో బ్యాలెన్సు తప్పిన విధంగా ఉండకూడదు.

రిపబ్లిక్ ప్రీరిలీజ్ కార్యక్రమంలోనూ.. తాజాగా రాజమండ్రి రోడ్ల మీద పవన్ ప్రదర్శించిన ఆగ్రహం అవసరానికి మించినట్లుగా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివి ఆయన అభిమానుల్లోఆ నిమిషానికి కేరింతలుకొట్టేలా చేయొచ్చుకానీ.. మిగిలిన ప్రజలకు.. సోషల్ మీడియాలో ఆయన చేష్టల మీద పంచ్ లు మీద పంచ్ లు పడటం ఖాయమని చెప్పక తప్పదు. ఒక కీలక నేత ఆవేశాన్ని ప్రదర్శించినప్పుడు ప్రజలకు ఆయన ఆవేదన.. బాధ కనిపించాలన్న విషయాన్ని పవన్ ఎప్పుడు గుర్తిస్తారో ఏమో?
Tags:    

Similar News