పవన్ క్లారిటి ఇచ్చేసినట్లేనా ?

Update: 2023-03-15 12:18 GMT
రాబోయే ఎన్నికల్లో పోటీ విషయమై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటి ఇచ్చేసినట్లేనా ? బందరులో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడుతు ఒంటరిగా పోటీచేసేంత సీన్ జనసేనకు లేదని అంగీకరించారు. పొత్తులు పెట్టుకునే వచ్చేఎన్నికల్లో పోటీచేస్తామని తేల్చేశారు. తమను 175 సీట్లకు పోటీచేయమని జగన్మోహన్ రెడ్డి పదేపదే ఎందుకు రెచ్చగొడుతున్నారో తనకు తెలుసన్నారు. జగన్ ట్రాపులో పడబోయేదిలేదన్నారు.

రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీచేసి బలిపశువు అయ్యేందుకు సిద్ధంగా లేదన్నారు. అంటే దీని అర్ధం ఏమింటటే జనసేన పొత్తుతో తప్ప ఒంటరిగా పోటీచేయదని చెప్పటమే. కాకపోతే ఎవరితో కలిసి ఎన్నికలను ఎదుర్కోవాలనే విషయంలో పవన్లో అయోమయం ఉన్నట్లు అర్ధమైంది. బీజేపీని ధైర్యంగా వదిలేయలేకపోతున్నారు. ఇదే సమయంలో టీడీపీతో కలవలేకపోతున్నారు. అంటే బీజేపీ-టీడీపీ మధ్యలో పవన్ ఇరుక్కుపోయినట్లు స్పష్టమవుతోంది.

175 సీట్లలో పోటీచేయాలా ? పొత్తు పెట్టుకుని పోటీచేయాలా అన్నది పూర్తిగా తమిష్టమే అని పవన్ చెప్పారు. మరీవిషయం చెప్పటానికి పవన్ ఎందుకింత సమయం తీసుకున్నారో అర్ధంకావటంలేదు. ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నది పూర్తిగా పవన్ ఇష్టమే అనటంలో సందేహంలేదు. కాకపోతే పొత్తుల విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోమని మాత్రమే జనసేన నేతలు కూడా పదేపదే చెబుతున్నది. పొత్తుపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేసేకొద్ది జరగబోయే నష్టాన్ని పవన్ గ్రహించినట్లు లేరు. తనకే కాదు ఎదుటిపార్టీకి కూడా నష్టమే అని పవన్ ఎప్పుడు తెలుసుకుంటారో.

అయితే బందరు సభలో ఇచ్చిన మరో క్లారిటీ ఏమిటంటే తాను సీట్ల విషయం టీడీపీతో ఇంతవరకు చర్చించనే లేదని. 20 సీట్లకు తాను అంగీకరించానని సోషల్ మీడియాలో కనిపిస్తున్నదాంట్లో ఎలాంటి నిజంలేదన్నారు. పవన్ చెప్పినదాని ప్రకారం పొత్తులో జనసేన 20 సీట్లకు మించే తీసుకుంటుందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లే అని అర్ధమవుతోంది. వచ్చేఎన్నికల్లో జనసేన ప్రభుత్వంలోకి వస్తుందని చెప్పారు కానీ ఎవరితో కలిసి అనే విషయంపైన మాత్రం క్లారిటి ఇవ్వలేదు. ఏదేమైనా చాలా అంశాలకు పవన్ క్లారిటి ఇవ్వకుండానే సభను ముగించేశారు.

Similar News