వారాహికి మోక్షం లభిస్తుందా ?

Update: 2023-05-13 11:13 GMT
మొత్తానికి తొందరలోనే వారాహికి మోక్షం లభించేట్లుంది. ఎంతో ముచ్చటపడి తయారుచేయించుకున్న వారాహి గడచిన ఏడునెలలుగా షెడ్డులోనే ఉన్న విషయం తెలిసిందే. వారాహి గురించిన పరిచయ కార్యక్రమం మాత్రం పవన్ బ్రహ్మాండంగా చేశారు. ఏదో సినిమా ట్రైలర్, టీజర్ లెవల్లో  బిల్డప్ ఇచ్చి ట్విట్టర్లో వీడియోను రిలీజ్ చేసి  తర్వాత షెడ్డులో పడేశారు. రాష్ట్రమంతా పర్యటించేందుకు వీలుగా వారాహిని పవన్ రెడీచేయించుకున్నారు. అందులోనే మైక్ సెట్లు, ఇన్వర్టర్లు, హెవీ ఫోకస్ లైట్లు, సెక్యూరిటి సిబ్బంది నిలబడటానికి వీలుగా విశాలమైన ప్లాట్ ఫారం తయారుచేయించారు.

వాహనం లోపల లెడ్ టీవీ విత్ ఇంటర్నెట్ సౌకర్యం, బాత్ రూమ్, బెడ్ రూమ్ లాంటి అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటుచేసుకున్నారు. ఎన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటే మాత్రం ఏమిటి ఉపయోగం.  పైగా కరీంనగర్లోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు కూడా చేయించారు. దీని రిజిస్ట్రేషన్ సమయంలో కూడా పెద్ద వివాదమే రేగింది. ఆ విధంగా మూడునాలుగు సందర్భాల్లో వారాహి బాగా హైలైట్ అయ్యింది.

దాంతో రోడ్లపైకి వారాహి వచ్చేయటం ఖాయమని చాలామంది ఎదురుచూశారు. ఎన్నిరోజులు ఎదురుచూసినా వారాహి అయితే రోడ్లమీదకు ఎక్కలేదు. దాంతో పవన్ అభిమానులు, జనసేన నేతలు, కార్యకర్తల్లో నిరుత్సాహం పెరిగిపోయింది. దాంతో అందరు వారాహి గురించి మాట్లాడటమే మానుకున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే తాను జూన్ నుండి ప్రజల్లో తిరగబోతున్నట్లు పవన్ ప్రకటించారు.

అంటే జూన్లో వారాహికి మోక్షం లభించటం ఖాయమని అనుకుంటున్నారు. మరి ఎక్కడి నుండి పర్యటనలు ప్రారంభించేది పవన్ చెప్పలేదు. ఎందుకంటే ఏపీలో కన్నా తెలంగాణాలో షెడ్యూల్ ప్రకారం ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కాబట్టి వారాహి వాహనం ముందుగా ఏపీలో కన్నా తెలంగాణాలోనే తిరిగే అవకాశముంది. జూన్ నుండి ప్రజల్లో తిరుగుతానని పవన్ చెప్పారు కానీ ఏపీలోనా లేకపోతే తెలంగాణాలోనా అన్న విషయంలో క్లారిటి ఇవ్వలేదు. తెలంగాణా ఎన్నికల్లో కూడా జనసేన పోటీచేస్తుందని పవన్ గతంలోనే ప్రకటించారు. కాబట్టి ముందు వారాహి తెలంగాణాలోనే తిరిగే అవకాశముందని అనిపిస్తోంది. మరి పవన్ ఏమిచేస్తారో చూడాలి.

Similar News