‘పెగాసస్’ మోడీషాల మెడకు చుట్టుకుంటుందా?

Update: 2021-07-30 05:34 GMT
‘పెగాసస్’.. ఇప్పుడు పార్లమెంట్ ను కుదిపేస్తోంది. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రతిపక్ష నేతలు దీనిపై బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ఇంత రచ్చ జరుగుతున్నా ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలు దీనిపై నోరు మెదపకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది.

దేశంలోని ప్రతిపక్షాల నేతలు, దేశంలోని ప్రముఖులు, జర్నలిస్టులు ఇలా సుమారు లక్షమంది మొబైల్ ఫోన్లను పెగాసస్ అనే సాఫ్ట్ వేర్ ద్వారా కేంద్రప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్షాలు నానా రచ్చ చేస్తున్నాయి.

వర్షకాల సమావేశాలు ప్రారంభం రోజున 19వ తేదీనే పెగాసస్ వ్యవహారం మీడియాలో వచ్చేసింది. అప్పటికే మోడీ సర్కార్ పై దేశంలోని ప్రతిపక్షాలు, ప్రముఖులు మండిపడ్డారు. ఇప్పటికీ అంతటా ఇదే రచ్చ కొనసాగుతోంది. గడిచిన కొద్ది రోజులుగా పార్లమెంట్ ఉభయసభల్లో ఈ పెగాసస్ వ్యవహారం అట్టుడుకుతోంది. ఇంత రచ్చ జరుగుతున్నా కూడా ప్రధాని నరేంద్రమోడీ దీనిపై ఒక్క ప్రకటన చేయడం లేదు. నోరు విప్పడం లేదు. పెగాసస్ ద్వారా మొబైల్ ఫోన్ ట్యాపింగ్ అన్నది మోడీకి తెలియకుండా జరిగే అవకాశమే లేదు. పైగా సాఫ్ట్ వేర్ కొనుగోలుకు కేంద్రం ఏకంగా రూ.300 కోట్లు ఖర్చుపెట్టిందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇంత గోల జరుగుతున్న మోడీ మాత్రం పార్లమెంట్ లో ఎందుకు నోరు విప్పడం లేదన్నది అందరినీ తొలుస్తున్న ప్రశ్న.

సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసి హ్యాక్ చేశామన్న ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధాని మోడీపై ఉంది. అయితే పెగాసస్ లాంటి కీలకమైన అంశంపై మోడీ నోరువిప్పకపోవడంతో ట్యాపింగ్ ఆరోపణలు నిజమేనని ప్రతిపక్షాలు.. మిగతా వారు భావించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో కూడా పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ సహా ఎన్నో కీలక విషయాలపై మోడీ స్పందించిన దాఖలాలు లేవు. నిర్ణయం తీసుకోవడం.. ప్రజలపై వదిలేయడం తప్పితే దానిపై వచ్చిన ఆరోపణలపై నోరువిప్పిన పాపాన పోలేదు. పార్లమెంట్ కు, జనాలకు అసలు మోడీ జవాబుదారి కాదా? అన్న డిమాండ్ ను ప్రతిపక్షాలు తెరపైకి తెస్తోంది.

నాడు రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణం విషయంలోనూ మోడీ నోరు విప్పలేదు. ఇప్పుడు పెగాసస్ లాంటి నిఘా స్కాంలోనూ మోడీ నుంచి ఏదీ రావడం లేదు. దీన్ని బట్టి తాను మౌనంగా ఉంటా.. మీరు కొట్టుకుచావండి అన్నట్టుగా మోడీ తీరు ఉంటోందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇక తాజాగా ‘పెగాసస్’పై చర్చించేందుకు ప్రతిపక్షాల నేతృత్వంలోని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పార్లమెంట్ లో బుధవారం సమావేశమైంది. అయితే ఈ సమావేశాన్ని జరుగకుండా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారు. అసలు కేంద్రప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసిందా? లేదా అనే అంశంపై ఉన్నతాధికారుల వెర్షన్ తెలుసుకునేందుకు ‘స్టాండింగ్’ కమిటీ సమావేశమైంది.

కాంగ్రెస్ సభ్యుడు శశిథరూర్ చైర్మన్ గా ఉన్నప్పటికీ మెజారిటీ సభ్యులు మాత్రం బీజేపీ ఎంపీలే కావడంతో శశిథరూర్ మాటను ఎవ్వరూ వినలేదు. ఉన్నతాధికారులకు నోరెత్తనీయకుండా బీజేపీ ఎంపీలు అడ్డుకున్నారు. సమావేశంపై మినట్స్ బుక్ లోనూ బీజేపీ ఎంపీలు సంతకాలు పెట్టకపోవడంతో చర్చ జరగనట్టేనని ముగించేశారు. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ ఎంపీలు పెగాసస్ పై ఉన్నతాధికారులను ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా అడ్డుకున్నట్టుగా అర్థమైంది.

బీజేపీ ఎంపీల చర్యతో ‘పెగాసస్’ సాఫ్ట్ వేర్ ను కేంద్రం కొనుగోలు చేసిందని.. అనుమానితులందరి మొబైళ్లను ట్యాపింగ్ చేయించిందని అర్థమైపోయింది.


Tags:    

Similar News