పెగాస‌స్ స్పై వేర్ ఇష్యూ.. క‌రోనా క‌ష్టాలు మ‌టాష్‌

Update: 2021-07-24 07:30 GMT
పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల‌పై.. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. క‌రోనా విజృంభ ణ‌, అనంత‌ర క‌ర్ఫ్యూ.. లాక్‌డౌన్ స‌హా.. త‌లెత్తిన మ‌ర‌ణాలు.. వంటి విష‌యాల్లో కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిపై ప్ర‌జ‌లు గుర్రుగా ఉన్నారు. అంతేకాదు.. క‌రోనా నేప‌థ్యంలో ఉపాధి కోల్పోయిన వారు.. విద్యార్తులు.. ఇలా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు కేంద్రంలోని మోడీ స‌ర్కారుపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. బ‌హుశ ఈ నాడిని ప‌సిగ‌ట్టో ఏమో.. ప్ర‌తిప‌క్షాలు కూడా స‌మావేశాల‌కు ముందు.. పార్ల‌మెంటులో మోడీ స‌ర్కారును నిల‌దీస్తామ‌ని.. ఎండ‌గ‌డ‌తామ‌ని.. ప్ర‌క‌టించాయి.

వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం అవుతున్నాయ‌ని అన‌గానే.. దేశ‌వ్యాప్తంగా కూడా ప్ర‌తిప‌క్షాల దూకుడు ఎలా ఉంటుంది? మోడీ స‌ర్కారుకు ఇబ్బంది త‌ప్ప‌దు.. క‌రోనా స‌హా అనేక వైఫ‌ల్యాలపై ప్ర‌తిప‌క్షాలు.. మోడీని ఎండ‌గ‌డ‌తాయి.. అని అంద‌రూ అనుకున్నారు. ఇక‌, బీజేపీ కూడా ఒకానొక స‌మ‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గురైంది. కానీ, ఇంత‌లోనే.. పెద్ద ఎత్తున ప‌రిస్థితి మారిపోయింది. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు చ‌ర్చించాల్సిన పార్ల‌మెంటులో ఇప్పుడు.. ప్ర‌తిప‌క్షాల ర‌గ‌డ అంతా కూడా పెగాస‌స్ చుట్టూ తిరుగుతోంది.


త‌మ ఫోన్ల‌ను హ్యాక్ చేస్తున్నార‌ని.. దీని వెనుక కుట్ర ఉంద‌ని.. విచార‌ణ‌కు ఆదేశించాల‌ని.. కోరుతూ.. గ‌డిచిన వారం రోజులుగా.. ఉభ‌య స‌భ‌ల్లోనూ ప్ర‌తిప‌క్షాలు తీవ్ర ఆందోళ‌న చేస్తున్నారు. దీంతో కీల‌క‌మైన స‌మ‌స్య‌ల న్నీ.. చాప‌చుట్టేశాయి. నిజానికి క‌రోనా అనంత‌ర ప‌రిస్థితులు.. పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు ఆకాశా న్ని అంట‌డం, నిత్యావ‌స‌ర ధ‌ర‌ల పెరుగుద‌ల‌.. నూత‌న సాగు చ‌ట్టాల‌పై జ‌రుగుతున్న రైతుల ఉద్య‌మం.. నిరుద్యోగ యువ‌త‌కు ఉద్యోగాలు, క‌రోనా టీకా ల‌భ్య‌త‌, ఎంపీ లాడ్స్ నిధుల పున‌రుద్ధ‌ర‌ణ‌.. ఇలా అనేక అంశాలు.. ఈ ద‌ఫా వ‌ర్షాకాల స‌మావేశాల్లో చ‌ర్చ‌కు రావాల్సిన అవ‌స‌రం ఉంది.


అయితే.. అధికార ప‌క్షం.. వ్యూహాత్మ‌కంగా వేసిన అడుగుతో ప్ర‌తిప‌క్షాలు.. చిక్కుకున్నాయ‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. పెగాస‌స్ అనేది ఇప్పుడు ఉన్న‌ది కాద‌ని.. 2019లోనే వెలుగు చూసింద‌ని. కానీ, విప‌క్షాల‌ను అధికార పార్టీ తెర‌చాటున రెచ్చ‌గొడుతోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. లేక‌పోతే.. ఇన్నాళ్లుగా లేనిది.. పెగాస‌స్ కేవ‌లం వ‌ర్షాకాల స‌మావేశాల ముందు తెర‌మీదికి రావ‌డం.. పొలో మంటూ.. ప్ర‌తిప‌క్షాలు దీనిని ప‌ట్టుకుని వేలాడ‌డం.. ఫ‌లితంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌క్క‌దారి ప‌ట్ట‌డం వంటివి గ‌మ‌నిస్తూనే ఉన్నాం.

దీనిని బ‌ట్టి చూస్తే.. అటు అధికార ప‌క్షం, ఇటు ప్ర‌తిప‌క్షం కూడా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌డం లేద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. అధికార ప‌క్షం అంటే.. ఎప్పుడూ త‌ప్పించుకుంటుంది. కానీ, ప్ర‌తిప‌క్షం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి.. అధికార ప‌క్షాన్ని నిల‌దీయాలి క‌దా! కానీ.. పెగాస‌స్‌.. ముందు.. ప్ర‌జ‌ల క‌ష్టాలు ప‌ట్టించుకునే తీరిక పాల‌కుల‌కు, ప్ర‌తిప‌క్షాల‌కు లేక పోవ‌డం గ‌మ‌నార్హం.




Tags:    

Similar News