చిక్కుల్లో నేత‌లు.. ఆ కేసులు రుజువైతే శిక్ష త‌ప్ప‌దు!

Update: 2021-08-24 11:30 GMT
ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం కోసమే రాజ‌కీయ నాయ‌కులు వ‌స్తార‌నే అభిప్రాయం గ‌తంలో ప్ర‌జ‌ల్లో ఉండేది. కానీ రాను రాను మారుతూ ఉన్న ప‌రిణామాలు త‌మ స్వార్థం కోస‌మే ప‌నిచేసే నేత‌లు ఈ రాజ‌కీయాల‌ను భ్ర‌ష్ఠు ప‌ట్టించార‌నే వాద‌న క్ర‌మంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇక ఇప్పుడేమో ప‌ద‌వుల్లో ఉన్న రాజ‌కీయ నాయ‌కుల్లో చాలామందిపై కేసులు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని 24 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల‌పై క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌ట్లు ఓ నివేదిక బ‌య‌ట‌పెట్టింది. దేశ‌వ్యాప్తంగా 2019 నుంచి 2021 వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలిచిన 2,495 మంది ప్ర‌జాప్ర‌తినిధుల అఫిడ‌విట్ల‌ను ప్ర‌జాస్వామిక సంస్క‌ర‌ణ‌ల సంఘం (అసోసియేష‌న్ ఫ‌ర్ డెమోక్ర‌టిక్ రిఫార్మ్ (ఏడీఆర్‌)) అధ్య‌య‌నం చేసి ఈ నివేదిక వెల్ల‌డించింది.

ఏపీలోని 24 మంది ప్ర‌జాప్ర‌తినిధుల‌పై క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌ట్లు ఈ నివేదిక తేట‌తెల్లం చేసింది. వీరిలో అధికార వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలే ఎక్కువ మంది ఉన్నారు. ఆ పార్టీకి చెందిన ఎంపీలు.. వైసీపీ లోక్‌స‌భ ఫ్లోర్ లీడ‌ర్ పీవీ మిథున్‌రెడ్డి, మార్గాని భ‌ర‌త్‌, బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్ర మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి, పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి సహా 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు క‌ర‌ణం బ‌ల‌రాం, వాసుప‌ల్లి గ‌ణేష్ పేర్లు కూడా అందులో ఉన్నాయి. మ‌రోవైపు ఇటు తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్‌, బీజీపీ ఎంపీల‌పైనా కేసులు పెండింగ్‌లో ఉన్న‌ట్లు తేలింది. సోయం బాపూరావు (బీజేపీ), కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి (కాంగ్రెస్‌), మాలోతు క‌విత (టీఆర్ఎస్‌) ఉన్నారు.

కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న ఈ కేసులు రుజువైతే తీవ్ర‌మైన శిక్ష ప‌డ‌డం ఖాయ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. సెక్ష‌న్ 8 (1), (2), (3) ప్ర‌కారం ఈ ప్ర‌జాప్ర‌తినిధుల‌పై కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఒక‌సారి శిక్ష‌ప‌డితే వీళ్లంద‌రిపై అన‌ర్హ‌త వేటు ప‌డుతుంద‌ని ఏడీఆర్ వెల్ల‌డించింది. శిక్షా కాలం మొద‌లైన రోజు నుంచే అన‌ర్హ‌త వేటు అమ‌ల్లోకి వ‌స్తుంది. దీంతో అటు జైలు జీవితం గ‌డ‌పాల్సి రావ‌డంతో పాటు ఇటు ప‌ద‌వులూ పోతాయి. అంతే కాకుండా జైలు నుంచి విడుద‌లైన త‌ర్వాత ఆరేళ్ల‌పాటు ఈ శిక్ష అనుభ‌వించిన ప్ర‌జాప్ర‌తినిధులు ఏ ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయ‌డానికి నిబంధ‌న‌లు ఒప్పుకోవు. దీంతో ఒక‌వేళ ఈ ప్ర‌జాప్ర‌తినిధుల‌పై కేసులు రుజువై శిక్ష‌లు ప‌డితే మాత్రం వాళ్ల రాజ‌కీయ భ‌విష్య‌త్ ముగిసిన‌ట్లేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఏడీఆర్ వెల్ల‌డించిన నివేదిక ప్ర‌కారం దేశ‌వ్యాప్తంగా 67 మంది ఎంపీలు, 296 మంది ఎమ్మెల్యేలపై అభియోగాలు న‌మోద‌య్యాయి. అందులో బీజేపీకి చెందిన వాళ్లు 83 మంది కాగా.. కాంగ్రెస్ నుంచి 47, టీఎంసీ నుంచి 25 మంది ఉన్న‌ట్లుగా తేలింది. వీటికి సంబంధించిన కేసుల వివ‌రాల‌ను ఎన్నిక‌ల స‌మ‌యంలో స‌మ‌ర్పించే అఫిడ‌విట్ల‌లో ఆయా నేత‌లు పొందుప‌రిచారు. అయితే వీటిలో కొన్నింటిని ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఉప సంహ‌రించుకున్న‌వి కూడా ఉన్నాయ‌ని వైసీపీ నేత‌లు పేర్కొంటున్నారు. కానీ తాజాగా ప్ర‌జా ప్ర‌తినిధుల‌పై కేసులు ఉప‌సంహ‌రించుకోవాలంటే సంబంధిత హైకోర్టు నుంచి అనుమ‌తి తీసుకోవాల‌ని సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఈ నాయుకులపై న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా ప్ర‌జాందోళ‌న‌ల్లో పాల్గొన్న స‌మ‌యంలోనివే కావొచ్చు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు రేణిగుంట విమానాశ్ర‌యంలో అధికారుల‌పై దాడి చేశార‌ని మిథున్‌పై కేసు న‌మోదైంది.  వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను కాపాడుకోవ‌డం కోసం ఈ కేసుల్లోనుంచి బ‌య‌ట‌ప‌డే ప్ర‌య‌త్నాల‌ను ఈ నాయ‌కులు మొద‌లుపెట్టిన‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News