ట్రంప్ కు షాకిచ్చిన పెన్సిల్వేనియా కోర్టు

Update: 2020-11-23 03:45 GMT
ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించిన తర్వాత కూడా.. తాను ఓడిపోలేదని.. ఓటమిని అంగీకరించలేదంటూ పిడివాదనను వినిపిస్తూ కోర్టు మెట్లు ఎక్కుతున్న ట్రంప్ టీంకు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా పెన్సిల్వేనియా కోర్టు నుంచి చుక్కెదురైంది. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ఎన్నికల్లో గెలవలేదని.. పెన్సిల్వేనియా పోలింగ్ లో అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా ట్రంప్ ఆరోపించటం తెలిసిందే.

ఇదే విషయాన్ని పేర్కొంటూ పెన్సిల్వేనియా కోర్టులో పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలు చేస్తున్నారు రిపబ్లికన్లు. వారి వాదన ప్రకారం.. దాదాపు 70 లక్షల ఓట్లు చెల్లనివంటూ ప్రకటించాలని కోరుతున్నారు. ఈ పిటిషన్లపై తాజాగా పెన్సిల్వేనియా మిడిల్ డిస్ట్రిక్ట్ కోర్టు స్పందించింది. ఈ పిటిషన్లను కొట్టేసింది. పోలింగ్ లో అక్రమాలు జరిగినట్లుగా చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరే ఎలాంటి ఆధారాలు లేవని తేల్చేశారు జడ్జిమాథ్యూ బ్రాన్ పేర్కొన్నారు.

తమకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుపై రిపబ్లికన్ పార్టీ నేతలు స్పందించారు. తాము ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లుగా పేర్కొన్నారు. తాము ఇచ్చిన ఆధారాల్ని పరిశీలించకుండానే జడ్జి తమ పిటిషన్లను డిస్మిస్ చేశారన్నారు. సదరు జడ్జి ఒబామా హయాంలో నియమించిన వ్యక్తి అని..అందుకే  అలాంటి తీర్పు ఇచ్చినట్లుగా సంచలన ఆరోపణలు చేశారు. మరీ.. వ్యవహారం రానున్న రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News