చంద్రబాబుకు పరీక్షేనా ?

Update: 2021-11-02 05:30 GMT
చంద్రబాబునాయుడు చేస్తున్న ఆరోపణలన జనాల ఎంతవరకు నమ్ముతున్నారనేందుకు ఓ పరీక్ష ఎదురుకాబోతోంది. ఈనెల 14-17 తేదీల మధ్య స్ధానికసంస్ధల ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే పూర్తిస్ధాయి ఎన్నికలు కాకపోయినా మినీసమరమనే చెప్పాలి. ఎందుకంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే గ్రామపంచాయితీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కొన్ని కొర్పొరేషన్లలోని డివిజన్లు, కొన్ని మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి.

మినీసమరంగా చెప్పుకునేందుకు వీలుగా 498 గ్రామ పంచాయితీలతో పాటు గతంలో ఎన్నికలు వాయిదాపడిన 69 సర్పంచి స్ధానాలకు, 85 ఎంపీటీసీలు, 11 జడ్పీటీసీలు, రెండు డివిజన్లు+13 వార్డు మున్సిపల్ వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా 9 జిల్లాలో జరగబోతున్నాయి. కాబట్టే రాష్ట్రంలోని ప్రజల మూడ్ ఏమిటో చూచాయగా అంచనా వేసేందుకు ఉపయోగపడతాయి.

కొద్దిరోజులుగా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజమని, డ్రగ్ స్టేట్ అని, రాష్ట్రంలో అరాచకం రాజ్యం ఏలుతోందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందనే ఆరోపణలతో ఢిల్లీదాక వెళ్ళి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత ? అబద్ధాలెంత అనే విషయంలో ప్రజలందరికీ మంచి క్లారిటినే ఉంది. అయినా తనకు మద్దతిచ్చే మీడియాతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదే పదే కథనాలు, వార్తలు రాయిస్తున్నారు.

ఒకవేళ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు నిజమే అని జనాలు అభిప్రాయపడితే మినీసమరం ఫలితాల్లో తేడా ఉంటుంది. ఈమధ్యనే జరిగిన స్ధానికసంస్ధల ఎన్నికల్లో టీడీపీ దాదాపు తుడిచిపెట్టుకుని పోయింది. ఈనెలలో జరగబోయే మినీసమరంలో కుప్పం మున్సిపల్ ఎన్నికలు కూడా ఉండటంతోనే చంద్రబాబు హడావుడి చేస్తున్నట్లు అర్ధమవుతోంది. కుప్పం మున్సిపాలిటిని గెలుచుకోవటంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో కూడా వైసీపీని జనాలు ఓడించాలి.

అధికార వైసీపీకి వ్యతిరేకంగా జనాలు తీర్పిచ్చినపుడు మాత్రమే చంద్రబాబు ఆరోపణలను జనాలు నమ్ముతున్నట్లు భావించేందుకు అవకాశం ఉంది. అలాకాని పక్షంలో చంద్రబాబు తన పోరాట పంథాను మార్చుకోకతప్పదు. ఎక్కడో కూర్చుని ప్రభుత్వంపై బురదచల్లేస్తే జనాలు నమ్ముతారని అనుకుంటే పనులు జరగవని చంద్రబాబు గ్రహించాలి. ప్రజలను కాకుండా కేవలం మీడియాను మాత్రమే నమ్ముకుంటే సరిపోతుందనే భ్రమల్లో నుండి చంద్రబాబు బయటపడాలి. మరి మినీసమరం పరీక్షలో చంద్రబాబు గెలుస్తారో లేదా తొందరలోనే తేలిపోతుంది.


Tags:    

Similar News