కేసీఆర్‌ కు వ్య‌తిరేకంగా తిరుప‌తిలో ధ‌ర్నా

Update: 2017-02-05 10:30 GMT
తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ప‌రిపాల‌న ప‌రంగా తీసుకున్న నిర్ణయాల‌పై సొంత రాష్ట్రమైన‌ తెలంగాణ‌లో కాకుండా పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో నిర‌స‌న‌లు వ్య‌క్త‌మవుతున్నాయి! ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి వద్దకు తీసుకువెళ్లాలని కేసీఆర్ నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ నిర్ణ‌యంపై తెలంగాణలో చెప్పుకోదగిన వ్య‌తిరేక‌త రాలేదు - నిర‌స‌న‌లు వ్యక్తం కాలేదు. కానీ చిత్రంగా కేసీఆర్  ముంద‌డుగును వ్యతిరేకిస్తూ తిరుపతిలో ఎస్సీలు ఆందోళనకు దిగారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాల మాదిగ‌ల‌ను చీల్చే కుట్ర‌కు కేసీఆర్ ఆజ్యం పోయ‌వ‌ద్ద‌ని కోరారు. తెలంగాణ‌లో తీసుకునే ఈ నిర్ణ‌యం మిగ‌తా వారిపైనా ప్ర‌భావం చూపుతుంద‌ని పేర్కొంటూ ద‌ళిత జాతి వ్య‌తిరేక ముద్ర‌ను తెచ్చుకోవ‌ద్ద‌ని వారు సూచించారు.

ఇదిలాఉండ‌గా... ఎస్సీ వర్గీకరణ అంశం పై ప్రధానితో చర్చించేందుకు ఇచ్చిన అపాయింట్‌ మెంట్‌ ఆఖరు నిమిషంలో రద్ధయింది. ఆదివారం కేసీఆర్ బృందం ఢిల్లీ బ‌య‌లు దేరాల్సి ఉండ‌గా అపాయింట్ మెంట్ ర‌ద్దు విషయాన్ని శనివారం రాత్రి ప్రధాని కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. అనివార్య కారణాల వల్ల సోమవారం అఖిలపక్ష కమిటీతో ప్రధాని నరేంద్ర మోడీ కలువలేక పోతున్నారని సీఎం కార్యాలయానికి ఫ్యాక్స్‌ పంపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారిక సమాచారం కూడా అందజేశారు. తిరిగి అపాయింట్‌ మెంట్‌ ఎప్పుడు ఖరారు చేస్తామనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తామని పీఎంవో అధికారులు తెలియజేశారు. దీంతో తెలంగాణ అఖిలపక్షం ఢిల్లి పర్యటన ప్రస్తుతానికి వాయిదా పడింది. 6వ తేదీన అపాయంట్‌ మెంట్‌ ఇచ్చి ఊహించని విధంగా రద్ధు చేయడం వెనుక రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో కేసీఆర్‌ సమాలోచనలు జరిపారు.

ప్ర‌స్తుత స‌మ‌యంలో ఎస్సీ వర్గీకరణకు మద్ధతు తెలిపితే ఆ క్రెడిట్‌ అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితికి, కేసీఆర్‌ ప్రభుత్వానికి దక్కుతుందన్న కుట్రతో ఇలా చేశారన్న వాదన టీఆర్ ఎస్ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్ధమయ్యారు. ఎస్సీ వర్గీకరణను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు అఖిలపక్షంతో ఢిల్లి వెళ్ళాలనుకున్న ఆయన సుమారు ఐదు రోజుల పాటు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. అన్ని రాజకీయ పక్షాల నేతలతో కలిసి ప్రధాని నరేంద్రమోడీతో ప్రత్యేకంగా సమావేశం కావాలనుకున్నారు. ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు, నిధులు, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై పలువురు కేంద్ర మంత్రులతో చర్చించాలనుకున్నారు. అయితే ఆఖ‌రు నిమిషంలో ప‌ర్య‌ట‌న వాయిదాప‌డింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News