కామన్వెల్త్ క్రీడాగ్రామం నుంచి 10 మంది అదృశ్యం.. అసలేమైంది?

Update: 2022-08-08 04:15 GMT
ప్రస్తుతం బ్రిటన్ లో కామన్వ్ ల్త్ క్రీడా మహోత్సవం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆటలు.. క్రీడాకారులు సాధించిన విజయాలు.. బద్ధలు కొట్టిన రికార్డులతో నిండిన వార్తల వేళ.. అందుకు భిన్నమైన ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. శ్రీలంక దేశానికి చెందిన పది మంది క్రీడాకారులు అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యారు. దీంతో..ఈ ఉదంతం కలకలాన్ని రేపుతోంది. అయితే.. ఈ క్రీడాకారులు కావాలనే ఇలా చేసి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మిస్ అయిన క్రీడాకారులంతా వారి ఈవెంట్లు పూర్తి అయ్యాకే ఇలా చేసినట్లుగా గుర్తించారు. మొత్తం పది మందిలో తొమ్మిది మంది క్రీడాకారులు ఉంటే.. మరొకరు మేనేజర్ గా చెబుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 160 మంది సభ్యులతో కూడిన శ్రీలంక టీం బ్రిటన్ కు వెళ్లింది. వీరిలో ముగ్గురు గత వారమే మిస్ కాగా.. మిగిలిన ఏడుగురు తాజాగా మిస్ అయ్యారు. తొలుత మిస్ అయిన ముగ్గురిని బ్రిటన్ పోలీసులు గుర్తించారు.

స్థానిక చట్టాల ప్రకారం వారి చర్య ఉల్లంఘన కాదంటున్నారు. ఎందుకంటే.. వారి దగ్గర ఉన్నవీసాలు ఆర్నెల్లు బ్రిటన్ లో ఉండేందుకు వీలుగా ఉండటంతో వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవటం లేదని చెబుతున్నారు.

ఇటీవల కాలంలో ప్రపంచంలో ఏదైనా దేశంలో క్రీడా మహోత్సవాలు జరుగుతున్నా.. మరేదైనా పోటీ నెలకొన్నా.. అక్కడికి వస్తున్న క్రీడాకారులు.. తమ ఆటలో పాల్గొన్న తర్వాత కనిపించకుండా పోతున్న ఉదంతాలు ఎక్కువగానే ఉన్నట్లు చెబుతున్నారు.

గత ఏడాది అక్టోబరులో నార్వేలోని ఓస్లోలో జరిగిన ప్రపంచ రెజ్లింగ్ చాంఫియన్ షిప్ టోర్నీకి వెళ్లిన సందర్ఱభంగా శ్రీలంక రెజ్లింగ్ జట్టు మేనేజర్ మిస్ అయ్యారు. ఎందుకిలా అంటే.. ప్రస్తుతం శ్రీలంకలో తీవ్ర ఆర్థిక పరిస్థితుల్లో ఉండటం.. రాజకీయంగా కూడా సంక్షోభం నెలకొనటం.. రోజువారీ జీవితానికి సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఇలా విదేశాల్లో జరిగే టోర్నీల్లో పాల్గొనటానికి వచ్చి.. ఆ తర్వాత కనిపించకుండా ప్రత్యామ్నాయ జీవితాన్ని వెతుక్కుంటున్నట్లుగా చెబుతున్నారు.

ప్రపంచంలో పర్యాటక దేశాల్లో ఒకటిగా ఉండే శ్రీలంక.. ఇప్పుడు ఆ దేశస్తులు విదేశాల్లో మిస్ అయిపోయే దుస్థితికి చేరుకున్న పరిస్థితి చూస్తే అయ్యో అనుకోకుండా ఉండలేం.
Tags:    

Similar News