రాజధాని కి వ్యతిరేకంగా పిటీషన్లు.. హైకోర్టు షాక్

Update: 2020-01-09 09:23 GMT
ఏపీ రాజధాని అమరావతి తరలింపును సవాల్ చేస్తూ హైకోర్టుకెక్కిన పిటీషన్ దారులకు షాక్ తగిలింది. రాజధాని తరలింపును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటీషన్లు అపరిపక్వమైనవని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేస్తూ కొట్టివేయడం సంచలనంగా మారింది.

రాష్ట్ర రాజధాని తరలింపుపై ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులేవీ జారీ చేయనప్పుడు.. అధికారికంగా ప్రభుత్వం ప్రకటన చేయనప్పుడు ఈ అంశంపై తామెలా జోక్యం చేసుకుంటామని  హైకోర్టు పిటీషన్లను కొట్టివేసింది. ఇప్పటికిప్పుడు దీనిపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తరలింపు అనేది ఒక్కరోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదని.. అందువల్ల ఈ విషయంలో తాము అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని హైకోర్టు కుండబద్దలు కొట్టింది. ఈ విషయంలో అత్యవసరం అనుకుంటే సంక్రాంతి సెలవుల తర్వాత పిటీషన్ వేయాలని పిటీషనర్లకు కోర్టు స్పష్టంచేసింది.

తాజాగా రాజధాని తరలింపుకు  ప్రభుత్వం  రంగం సిద్ధం చేస్తోందని.. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని న్యాయవాది కొర్రపాటి సుబ్బారావు సహా చాలా మంది హైకోర్టులో పిటీషన్ వేశారు. చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ధర్మాసనం దీని పై విచారించింది. ప్రభుత్వం నుంచి రాజధాని తరలింపు పై  ఏవైనా అధికారిక ఉత్తర్వులు వచ్చాయా అని ప్రశ్నించింది. రాలేదని సమాధానం రావడంతో దీనిపై అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది.
Tags:    

Similar News