పెట్రోల్‌, డీజిల్‌ ఈ డైనోసార్ల వల్లే పుట్టుకొచ్చాయా..?

Update: 2023-05-23 08:12 GMT
చమురు.. పెట్రోల్‌, డీజిల్‌ సహా అనేక ఇంధనాలకు మూలం. ప్రపంచంలో రోజుకు 80 మిలియన్‌ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తున్నారు. నేటి ఆధునిక ప్రపంచం ముందుకు సాగడానికి ఈ చమురు ఒక ఇంజన్‌ లాంటిదని చెప్పవచ్చు. నల్ల బంగారంగా పిలిచే ఈ చమురు భూమిలో ఎలా నిక్షేపంగా మారింది. అత్యంత విలువైన చమురు ఎప్పుడు.. ఎలా ఏర్పడింది. చమురు పుట్టుకకు మూలం డైనోసార్ల. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..

చమురు పుట్టుకకు మూలాలను చాలా మంది శాస్త్రవేత్తలు చెబుతారు. ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతున్నా వాస్తవమేంటనేది అంతుచిక్కని ప్రశ్న. చమురు హైక్రోకార్బన్ల మిశ్రమం. దీని పరమాణువు నిర్మాణంలో ప్రధానంగా కార్బన్‌, హైడ్రోజన్లు ఉంటాయి. లక్షల సంవత్సరాల పాటు భూమిలో జరిగిన అనేక ప్రక్రియల వల్ల తయారైన ఉత్పత్తి ఇది. చమురు నిల్వలలో 70 శాతం వరకు మెసోజోయిక్‌ యుగంలో ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ యుగం 252 నుండి 66 మిలియన్‌ సంవత్సరాల క్రితం నాటిదన్నమాట.

డైనోసార్ల నుండి చమురు వస్తుందనే వాదన కూడా చాలా మందిలో ఉంది. ఈ వాదన ఎలా పుట్టిందో ఖచ్చితంగా తెలియదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. సైన్సులో అపోహలను వెంటనే తిరస్కరించాలని, లేకపోతే ముందుకు సాగలేమని అంటున్నారు. వనరు మూలం ఎక్కడి నుండి వచ్చిందో అర్థం చేసుకోవాలంటున్నారు. విచిత్రమైన కారణాలతో డైనోసార్ల నుండి చమురు వస్తుందనే వాదన చాలా మందిలో ఉందని, కానీ చమురు ఆల్గే, పాచిల నుండి వస్తుందని భూగర్బ శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. చమురు ఉత్పత్తికి చాలా పెద్ద పరిమాణంలో పదార్థం అవసరం అవుతుందని, అందువల్ల అది సముద్రంలో పెద్దమొత్తంలో ఉండే పాచి కారణంగా మాత్రమే సాధ్యమవుతుందని వారు అంటున్నారు.  

ఆయిల్‌ పుట్టుకలో ప్రధాన పాత్ర పోషించింది సరిసృపాలు కావు. అంటే డైనోసార్లు కావని అర్థం. చిన్న జీవులే చమురు ఉత్పత్తికి కారణం. సుమద్రం అడుగులో దిగువన పేరుకుపోయిన జంతువుల అవశేషాలు, మైక్రో అల్గేలు కుళ్లిపోవడం ద్వారా ఏర్పడిన వనరే చమురు. ఇది సేంద్రీయ పదార్థాల మిశ్రమం. వేల యేండ్ల తర్వాత ఒత్తిడి, ఉష్ణోగ్రత పెరగడం ద్వారా హైడ్రోకార్బన్‌ ఏర్పడి చమురుకు కారణమవుతుంది. మొత్తంగా డైనోసార్ల అవశేషాల ద్వారా చమురు ఉత్పత్తి అవలేదని శాస్త్రవేత్తల మాట.

Similar News