పిన్నమనేని కాపాడింది..ఆయన భార్యను బలిగొంది సీట్ బెల్టే

Update: 2016-05-17 07:14 GMT
దారుణమైన రోడ్డు ప్రమాదాలు ఈ మధ్యన తరచూ చోటు చేసుకుంటున్నాయి. రహదారుల రక్తదాహాం మీద ప్రభుత్వాలు.. అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకోకపోవటం.. ఎవరైనా ప్రముఖులకు ఏదైనా జరిగినప్పుడు దాని మీద నాలుగు రోజులు చర్చ జరగటం.. ఆ తర్వాత మర్చిపోవటం ఒక అలవాటుగా మారిందని చెప్పలి. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత.. ఏపీ అప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు.. ఆయన సతీమణి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురి కావటం తెలిసిందే.

విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న వారి వాహనం వెనుక టైరు మంగళవారం తెల్లవారుజామున ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర పేలిపోవటం.. ఈ ఘటనలో కారు బోల్తా పడటంతో పిన్నమనేని సతీమణి.. కారు డ్రైవర్ మరణించటం తెలిసిందే. ఈ ఘటనలో పిన్నమనేని మాత్రం కొద్దిపాటి దెబ్బలు మాత్రమే తగిలాయి. ఈ ప్రమాదానికి సంబంధించి తాజాగా ఒక కీలక అంశం బయటకు వచ్చింది.

ప్రమాదానికి గురైన పిన్నమనేని వెంకటేశ్వరరావు సీటు బెల్ట్ పెట్టుకోగా.. ఆయన సతీమణి మాత్రం సీటు బెల్ట్ పెట్టుకోలేదని.. అదే ఆమె ప్రాణాల్ని బలి తీసుకుందని చెబుతన్నారు. మితిమీరిన వేగంతో కారును నడుపుతున్న డ్రైవర్ దాసును పిన్నమనేని పలుమార్లు వారించినట్లుగా చెబుతున్నారు. కారుస్పీడును తగ్గిస్తూ.. మరికాసేపటికి పెంచుతూ దాసు కారు నడిపినట్లుగా చెబుతున్నారు.

విజయవాడలో బయలుదేరిన వెంటనే పిన్నమనేని సీటుబెల్ట్ పెట్టుకోగా.. ఆయన సతీమణి సత్యవాణితోపాటు.. కారు డ్రైవర్ దాసు కూడా సీటు బెల్ట్ పెట్టుకోకపోవటం గమనార్హం. సీటు బెల్ట్ పెట్టుకోవటం వల్ల పిన్నమనేని ప్రాణాలతో బయటపడితే.. అదే సీటు బెల్ట్ ను పెట్టుకోని కారణంగా పిన్నమనేని సతీమణి.. ఆయన కారు డ్రైవర్ మరణించినట్లుగా తెలుస్తోంది. కారులో ప్రయాణిస్తున్న వారు ఎవరైనా సీటు బెల్ట్ పెట్టుకోవటం తప్పనిసరి అన్న విషయాన్ని ఈ ఉదంతం చూసైనా గుర్తుంచుకోవటం మంచిది.
Tags:    

Similar News