జేఏసీలో అంతా సెట్ అయిపోయింద‌ట‌

Update: 2017-02-25 05:22 GMT
నిరుద్యోగ ర్యాలీ సంద‌ర్భంగా తెలంగాణ జేఏసీలో నెల‌కొన్న వివాదం సద్దుమణిగింది. టీజేఏసీ చైర్మెన్‌ కోదండరాంతో కన్వీనర్‌ పిట్టల రవీందర్‌ సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించుకున్నారు. ఉద్యమం జరుగుతున్నప్పుడు వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమని పిట్టల రవీందర్‌ తెలిపారు. మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించబోనన్నారు. తాను టీజేఏసీలోనే కన్వీనర్‌ గా ఉన్నానని చెప్పారు. తనను ఏవిధంగా ప్రభుత్వం లొంగదీసుకుంటుందని ఆయ‌న ప్రశ్నించారు. తాను, కోదండరాం ఫోన్‌ లో మాట్లాడుకున్నామని, వారం రోజుల్లో టీజేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.

నిరుద్యోగ ర్యాలీ నిర్వహణ సమయంలో టీజేఏసీ నేతల మధ్య వివాదం నెలకొన్నట్టు ప్రచారం జరిగింది. నిరుద్యోగ ర్యాలీని కోదండరాం వన్‌మ్యాన్‌ షోగా జరిపారని, ఆయన వైఖరిని ఖండిస్తూ టీజేఏసీ కన్వీనర్‌ పిట్టల రవీందర్‌  సమావేశానికి గైర్హాజర్‌ అయ్యారని కథనాలు వచ్చాయి. టీజేఏసీలో రాష్ట్ర ప్రభుత్వం చిచ్చుపెట్టిందని, రవీందర్‌ కు కార్పొరేషన్‌ పదవిని ఆశ చూపిందని కూడా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి రెండురోజుల్లో ఉత్తర్వులు రానున్నట్టు వార్తలు వచ్చాయి. ఒక మంత్రి, ఎమ్మెల్సీ కలిసి పిట్టల రవీందర్‌ ను టీఆర్‌ ఎస్‌ వైపు తిప్పుకున్నారని ఆరోపణలు వినిపించాయి. అయితే కోదండరాం-పిట్టల రవీందర్‌తో మాట్లాడటంతో వివాదం సద్దుమణిగిందని, మీడియాలో వచ్చిన కథనాలను ఆయన కొట్టిపారేశారని తెలిసింది. తాను మళ్లీ టీజేఏసీలో కొనసాగుతానని, తనకు ఎక్కడికి వెళ్లే ఆలోచన లేదని చెప్పినట్టు తెలిసింది

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News