దుబాయ్ లో మోడీకి 'ప్రత్యేక' ప్లకార్డ్ నిరసన

Update: 2015-08-19 04:06 GMT
వేలాది మందితో కిక్కిరిసిన దుబాయ్ క్రికెట్ స్టేడియంలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ సభలో ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించిన నిరసన ప్లకార్డు ప్రదర్శితమైంది. ఏపీకి చెందిన వ్యక్తి ప్లకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేయటం కనిపించింది. ఎన్నికల సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన మోడీ.. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మాత్రం పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీకి న్యాయం చేయాలంటూ ఇంగ్లిషు.. తెలుగులో పేర్కొన్న ఒక ప్లకార్డును పట్టుకొని తన నిరసనను వ్యక్తం చేశారు. వేలాది మంది వచ్చిన సభలో ఈ వ్యక్తి నిరసన ప్రధాని మోడీ దృష్టిని ఆకర్షించకపోవచ్చు కానీ.. చుట్టూ ఉన్న వందలాది మంది మాత్రం ఆసక్తిగా చదవటం కనిపించింది.

చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన ఒంటెల రఫీ అనే యువకుడు దుబాయ్ లో  మోడీ సమావేశానికి వచ్చి మరీ ప్రత్యేకహోదా మీద తన గళాన్ని ప్లకార్డు రూపంలో ప్రదర్శించారు. విభజన కారణంగా ఏపీకి విపరీతమైన అన్యాయం జరుగుతుందని.. సరైన హామీలు ఇవ్వకుండా అడ్డగోలుగా విభజించటం వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని.. ప్రత్యేకహోదాతో ఎంతో కొంత పరిహారం అందుతుందని ఆశించినా.. అలాంటిదేమీ జరగకపోవటం పట్ల అగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

తాను మోడీ మాటలు వినేందుకు రాలేదని.. కేవలం తన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మోడీ దృష్టికి తీసుకొచ్చేందుకే వచ్చానని పేర్కొన్న అతగాడు..ఇచ్చిన హామీల్ని మోడీ మర్చిపోకూడదని వ్యాఖ్యనిస్తున్నారు.
Tags:    

Similar News