ఓవైసీ డిక్లేర్స్... కేసీఆర్ ను ఓడించడం మోదీ వల్ల కాదంతే

Update: 2019-07-06 16:27 GMT
భారతీయ జనతా పార్టీ... కేంద్రంలో వరుసగా రెండో సారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత... ఇప్పటిదాకా తనకు చిక్కని రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ జాబితాలో తెలుగు నేలకు చెందిన తెలంగాణ తొలి స్థానంలో ఉంది. బీజేపీ సభ్యత్వ నమోదును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ నుంచే ప్రారంభించడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తాజా ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి దిగిన బీజేపీ... తెలంగాణలో ఏకంగా నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకుని సత్తా చాటింది. ఇదే ఊపును కొనసాగించడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాల్సిందేనన్నది కమలనాథుల ప్లాన్. అంటే కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ను మట్టి కరిపించాలన్నదే వారి భావన. ఇంకా చెప్పాలంటే... కేసీఆర్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఓడించి తీరతారన్నది బీజేపీ నేతల స్ట్రాంగ్ ఫీలింగ్. అయితే కేసీఆర్ ను ఓడించడం అంత వీజీ కాదని, మోదీ చేత అస్సలు కాదని కేసీఆర్ మిత్రుడు, మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బల్గ గుద్ది మరీ చెబుతున్నారు.

ఇందుకు గల కారణాలను కూడా ఓవైసీ చాలా క్లియర్ గానే చెబుతున్న తీరు ఇప్పుడు నిజంగానే ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమైనా... హిందూత్వ వాదాన్నే నమ్ముకున్న మోదీ... కేసీఆర్ ను ఓడించడం మాత్రం అసాధ్యమని ఓవైసీ తెగేసి చెప్పేశారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయంపై ఆసక్తికర కామెంట్లు చేసిన ఓవైసీ... మోదీ చేతిలో కేసీఆర్ ఎందుకు ఓడిపోరో కూడా క్లియర్ రీజన్స్ నే వివరించారు. ఈ దిశగా ఓవైసీ లెక్కేమిటన్న విషయానికి వస్తే... హిందూత్వ వాదాన్నే ఆసరా చేసుకుని మోదీ రంగంలోకి దిగితే... మోదీని మించిన హిందువుగా కేసీఆర్ ఉన్నారట. మోదీ రెండు గుళ్లకు వెళితే... అదే సమయంలో కేసీఆర్ ఆరు గుళ్లకు వెళ్లి వస్తారట. మొత్తంగా తాను నమ్మిన హిందూత్వ వాదంతో కేసీఆర్ ను మోదీ ఓడించడం దుస్సాధ్యమేనన్నది ఓవైసీ వాదన.

నిజమే మరి... పూజలు, వ్రతాలు, యగ్న యాగాదులు చేయడంలో కేసీఆర్ కు మోదీకి మించిన రికార్డు ఉంది. మరి హిందూత్వ వాదాన్నే నమ్ముకున్న మోదీ... తనకంటే అపర హిందువుగా ఉన్న కేసీఆర్ ను ఓడించడం దుస్సాధ్యమే కదా. ఇదీ ఓవైసీ లెక్క. సరే... ముస్లింల తరఫున చొక్కాలు చించుకునేంత రేంజిలో విరుచుకుపడే ఓవైసీ... హిందువు అయిన కేసీఆర్ తో ఫ్రెండ్ షిప్ ఎలా చేస్తున్నారన్న విషయాన్ని కూడా ఏమాత్రం బేషజం లేకుండానే ప్రస్తావించారు. హిందూ మతానికి తాను వ్యతిరేకం కాదని, హిందూత్వానికి మాత్రమే తాను వ్యతిరేకినని చెప్పుకున్న ఓవైసీ.. హిందువుగా ఉన్న కేసీఆర్ తో తన ఫ్రెండ్ షిప్ చాలా గట్టిదేనని కూడా చెప్పుకున్నారు.

    

Tags:    

Similar News