`కాశీ ద‌ర్శ‌న్` వెనుక మోడీ `త‌మిళ‌నాడు ద‌ర్శ‌న్‌`

Update: 2022-11-26 02:30 GMT
``మ‌న‌కు చేయాల‌నే చిత్త‌శుద్ది ఉండాలి కానీ, ఎలాగైనా చేయొచ్చు``.. ఇది ఇటీవ‌ల ఆర్ ఎస్ ఎస్ ప్ర‌స్తుత చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ చేసిన వ్యాఖ్య‌. ఆయ‌న ఉద్దేశం వేరే ఉంది. కానీ, ప్ర‌ధాని మోడీ మాత్రం దీనిని త‌న‌కు, త‌న వ్యూహానికి అన్వ‌యించుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ద‌క్షిణాదిలో పాగా వేయాల‌ని కొన్నాళ్లుగా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్న మోడీ అండ్‌కోలు.. తెలంగాణ‌లో రాజకీయ వేడి పుట్టించి సెగ‌కాగుతున్నార‌నే వాద‌న ఉంది. ఇక‌, ఏపీలోనూ.. త‌మ కీలు బొమ్మ‌ల‌తో కాలం వెళ్ల‌దీస్తున్నార‌నే టాక్ ఉండ‌నే ఉంది.

మ‌రోవైపు.. క‌ర్ణాట‌క‌లో ఎలానూ బీజేపీ స‌ర్కారే ఉంది. ఎటొచ్చీ.. లేంద‌ల్లా కేర‌ళ‌, త‌మిళ‌నాడు. ఈ క్ర‌మంలో ముందు త‌మిళ‌నాడు వంతు పెట్టుకున్నారో ఏమో.. ఇక్క‌డ కీల‌క రాజ‌కీయ వ్యూహానికి తెర‌దీశార‌నే విమ‌ర్శ‌లు, వాద‌న‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. దీనికి కార‌ణం.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు త‌మిళ‌నాడుపై విసిరిన `కాశీ ద‌ర్శ‌న్‌` పంజానే అంటున్నారు ప‌రిశీల‌కులు. సుప్రసిద్ధ పుణ్య `క్షేత్రం కాశీ, తమిళ సంగమం` పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం ఇప్పుడు రాజ‌కీయ దుమారానికి దారితీస్తోంది.

తమిళనాడులోని హిందువులను త‌మ‌వైపు(బీజేపీ) తిప్పుకొనేలా భారీ స్కెచ్ వేసిన‌ట్టు మేధావులు సైతం అనుమానిస్తున్నారు. నవంబరు 19 నుంచి నెల రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి అనేక మంది హిందువుల‌ను బృందాలు తీసుకుని, ప్ర‌త్యేక రైళ్ల‌ను కూడా ఏర్పాటు చేసి.. పూర్తి దారి ఖ‌ర్చులు, భోజ‌న స‌దుపాయాల‌తో పాటు త‌ల‌కొ రూ.2000 చొప్పున పందేరం చేసి.. కాశీలో వారికి విశ్వ‌నాథుని ద‌ర్శ‌న భాగ్యంతోపాటు ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను కూడా చూపిస్తున్నారు.

ఎందుకిలా?

నిజానికి దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఒడిసా కూడా ఢిల్లీకి దూర‌మే. కానీ, అక్క‌డ‌లేని ఈ ప్ర‌యోగం కేవ‌లం త‌మిళ‌నాడుపైనే మోడీ ప్ర‌యోగించ‌డం.. రాజ‌కీయంగా విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2,500 మందిని రెండు రోజుల‌కు ఒక‌సారి తీసుకువెళ్తున్నారు. విద్యార్థి, ఉపాధ్యాయ, సాంస్కృతిక, వారసత్వ, ఆధ్యాత్మిక, వ్యాపార, తదితర రంగాలకు చెందిన మొత్తం 12 వర్గాలవారిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నారు.  

సీపీఎం విడుదల చేసిన ప్రకటనలో, ఈ కార్యక్రమాన్ని తమిళ సంస్కృతిని దేశంలోని ఇతర ప్రాంతాల్లో చాటి చెప్పడం కోసం ఏర్పాటు చేసినట్లు ఆర్గనైజింగ్ కమిటీ చెప్తోందని, అయితే దీని కోసం ఎంపిక చేసినవారిని పరిశీలించినపుడు త‌మిళ‌నాడులో బీజేపీకి పునాదులు వేసే ప్ర‌క్రియ ప్రారంబ‌మైన‌ట్టు క‌నిపిస్తోంద‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రవేశించేందుకు ఆరెస్సెస్ అనేక మార్గాల్లో ప్రయత్నిస్తోందని తెలిపింది.

ఇది కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమమని నిర్వాహక కమిటీ చెప్పడాన్ని తమిళనాడు ప్రోగ్రెసివ్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంగీకరించడం లేదు. కాశీ, తమిళనాడు మధ్య సాంస్కృతిక అనుబంధం లేదని చెప్తోంది. కేవ‌లం త‌మిళ‌నాడులో బీజేపీ పాగా వేసేందుకు మాత్ర‌మే ఇది చేస్తున్నార‌ని ఆరోపించింది.

పార్టీల మౌనం వెనుక‌..

అయితే, ఇంత జ‌రుగుతున్నా.. త‌మిళ‌నాడులోని అధికార‌, ప్ర‌తిపక్షాలు మాత్రం మౌనంగా ఉన్నాయి. దీనికి కార‌ణం.. ఏం మాట్లాడితే, బీజేపీ ఎటు నుంచి దాడి చేస్తుందో అనే భ‌య‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథుడిని, తమిళనాడు, రామేశ్వరంలోని రామేశ్వరుడిని దర్శించుకుంటే పాపాలన్నీ నశిస్తాయని, విముక్తి లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. ఇప్పుడు దీనిని రాజ‌కీయం చేస్తే.. వారి మ‌నోభావాలు దెబ్బ‌తిని త‌మ ఓటు బ్యాంకు బీజేపీకి అనుకూలంగా మారే ప్ర‌మాదం ఉంద‌ని పార్టీలు లెక్క‌లు క‌డుతున్నాయి. అందుకే మౌనంగా ఉండిపోయాయి.
 
బీజేపీలో ఉత్సాహం

ఉత్తరాది, దక్షిణాది విజ్ఞాన, సాంస్కృతిక సంప్రదాయాలను మరింత చేరువ చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని బీజేపీ సంబరపడుతోంది. పరస్పరం తమ వారసత్వాల గురించి అవగాహన కల్పించుకోవడానికి, ప్రజల మధ్య సత్సంబంధాలను మరింత పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నాన్ తమిళ్ ఇమేజ్‌తో ఇబ్బంది పడుతున్న బీజేపీకి రాజ‌కీయంగా కూడా ఇది కలిసివచ్చే అంశమని ఆ పార్టీ నేతలు సంతోషిస్తున్నారు. ఏదేమైనా.. త‌మిళ‌నాడుపై మోడీ రాజ‌కీయ వ్యూహం ప్ర‌స్తుతానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News