పోలవరం ఎప్పటికి పూర్తి కాదంతే.. తేల్చేసిన సీనియర్ నేత!

Update: 2022-05-24 10:32 GMT
ఉన్నది ఉన్నట్లుగా.. ఎవరో ఏదో అనుకుంటారన్న సంకోచం అన్నది కించిత్ లేకుండా మాట్లాడే అతి కొద్ది మంది సీనియర్ నేతల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ ముందుంటారు. ఏపీ రాజకీయాల్లో ఉండవల్లికి ఉన్నంత సబ్జెక్టులో పావు వంతు ఉన్న వాళ్లను వేళ్ల మీద లెక్కించొచ్చని చెప్పక తప్పదు. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం తప్పించి.. విషయాన్ని విషయంగా వివరించే వారు చాలా చాలా తక్కువని చెప్పక తప్పదు. అలాంటి ఆయన తాజాగా ఏపీ వరప్రసాదంగా చెప్పే పోలవరం  ప్రాజెక్టు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీ జలవనరుగా అభివర్ణించే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి కాదని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం డ్యామ్ అనేది ఉండదన్న ఆయన.. అందుకు భారీ నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పోలవరం  ప్రాజెక్టు పూర్తి కాదని తాను మానసికంగా సిద్ధపడినట్లుగా ఆయన తేల్చేశారు. ఏదో చిన్నపాటి రిజర్వాయర్ అయినా పూర్తి చేస్తే బాగుంటుందని తాను భావిస్తున్నట్లుగా చెప్పారు.

పోలవరం ప్రాజెక్టును కట్టే ఆలోచన కేంద్రానికి లేదన్న ఉండవల్లి.. దాని గురించి కేంద్రాన్ని అడిగే ధైర్యం ఏపీలోని ఏ పార్టీకి లేదంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తన భుజాన వేసుకున్న తీరుపై నాడు ప్రశ్నించిన ఉండవల్లి.. తాజాగా మాట్లాడుతూ.. ''గతంలో టీడీపీ ప్రభుత్వం ఎలా ఉందో.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అలానే ఉంది. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి అవుతుందో తెలీదన్న ఇరిగేషన్ మంత్రి మాటల్లో వాస్తవం ఉంది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు బాధ్యతను కేంద్రానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

పోలవరం మాత్రమే కాదు.. విభజన హక్కుల్ని సాధించుకునే స్థితి ఏపీలోని ఏ పార్టీకి లేదన్నారు. ఎందుకంటే.. ఏపీ నేతల ఆస్తులన్ని కూడా హైదరాబాద్ లో ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేయటం ద్వారా.. అసలు కారణం ఏమిటన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. 'చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్.. జగన్ కు చెందిన భారతి సంస్థల ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్ లోనే ఉన్నాయి.

చాలామంది పార్టీ నేతల ఆస్తులు హైదరాబాద్ లోనే ఉన్నాయి. కాబట్టే వైసీపీ.. టీడీపీ నేతలు విభజన అంశాల మీద తెలంగాణ ప్రభుత్వంపై పోరాడలేకపోతున్నాయి'' అంటూ నిష్ఠూరం లాంటి నిజాన్ని కుండబద్ధలు కొట్టేశారు.

తానీ విషయాల్ని గతంలోనే చెప్పానని.. కానీ ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. అందుకే తాను మాట్లాడటం తగ్గించినట్లుగా చెప్పారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పిన ఉండవల్లి మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News