తలుపులు బద్ధలు కొట్టి మరీ ముద్రగడ అరెస్ట్

Update: 2016-06-09 14:58 GMT
ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి. ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న ఏపీ ముఖ్యమంత్రి గొయ్యి కంటే నుయ్యే బెటర్ అని డిసైడ్ నట్లుగా కనిపిస్తోంది. ఏది ఏమైనా చట్ట బద్ధంగా వ్యవహరించటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న మాట అనిపించుకునే దిశగా అడుగులు వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా ఉంది. విషయాన్ని నానపెట్టి.. చివరకు అదో పెద్ద ఇష్యూగా మారకముందే ఇష్యూను ఒక కొలిక్కి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి గురువారం ఉదయం నుంచి సాగుతున్న హైడ్రామాకు నాటకీయ పరిణామాల నేపథ్యంలో కాపు ఉద్యమనేత ముద్రగడను పోలీసులు అరెస్ట్ చేశారు.

గతంలో చేసిన తప్పుల్ని పునరావృతం కాకుండా జాగ్రత్త పడిన చంద్రబాబు.. ముద్రగడ తాజాగా చేస్తున్న దీక్ష కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కాపు సెంటిమెంట్ బలపడి.. కాపు సమాజం ఆందోళనల బాట పట్టకముందే ఆయన రియాక్ట్ అయ్యారు. ముద్రగడ పద్మనాభంను బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకోవటం ద్వారా ఆయన ఎలాంటి ఆఘాత్యానికి పాల్పడకుండా ఉండాలన్నది బాబు సర్కారు ఆలోచనగా ఉంది. తన ఆందోళనలతో షాకుల మీద షాకులిస్తున్న ఆయన తీరుతో.. ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందన్న ఉద్దేశంతో జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.

గురువారం ఉదయం నుంచి సాగిన హైడ్రామా.. సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చిందని చెప్పాలి. తుని విధ్వంసకాండలో అరెస్ట్ అయిన నిందితుల్ని విడిచి పెట్టాలని.. కేసులు పెట్టిన వారిపై చర్యలు ఏమీ తీసుకోకుండా ఉండాలన్న డిమాండ్ తో ఇంట్లో ఆమరణ దీక్ష షురూ చేసిన సంగతి తెలిసిందే. తలుపులు బిగించుకొని దీక్ష షురూ చేసిన ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తే.. పురుగుల మందు డబ్బా పట్టుకొని.. తనను అరెస్ట్ చేస్తే ఆత్మహత్య చేసుకుంటానన్న బెదిరింపుతో వెనక్కి తగ్గారు.

తనను లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారన్న ప్రశ్నతో పాటు.. తనపై నమోదు చేసిన కేసుల తాలూకు ఎఫ్ ఐఆర్ కాపీలు చూపించకుండా అదుపులోకి తీసుకోవటాన్ని తాను ఒప్పుకోనన్న ఆయన.. తనను సీఐడీ పోలీసులు మాత్రమే అరెస్ట్ చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా రంగంలోకి దిగిన సీఐడీ పోలీసులు.. గురువారం మధ్యాహ్నానానికే కిర్లంపూడికి చేరుకున్నారు. మీడియాను దూరంగా పంపిన పోలీసులు.. అనంతరం ముద్రగడ అనుచరుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఆ వెంటనే ముద్రగడ ఇంటి తలుపు బద్ధలు కొట్టి లోపలికి ప్రవేశించిన పోలీసుల తీరును నిరసిస్తూ.. పురుగుల మందు డబ్బా మూత తీసి తాగే ప్రయత్నం చేసినట్లుగా చెబుతున్నారు. ప్రమాదాన్ని ఊహించిన పోలీసులు ముద్రగడకు పురుగుల మందు తాగే అవకాశం ఇవ్వకుండా ఆయన చేతి నుంచి దాన్ని కిందకు పడేశారు. ఈ సందర్భంలో కొంత పురుగుల మందు ఆయన చొక్కా మీద పడినట్లుగా కొందరు.. పడలేదని కొందరు వాదించుకునే పరిస్థితి. ఇదిలా ఉండగా.. పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో ముద్రగడ పురుగుల మందు తాగినట్లుగా ప్రచారం జరగటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముద్రగడ పురుగుల మందు తాగలేదని స్పష్టం చేయటంతో పాటు.. ఆయన్ను రాజమహేంద్రవరంలోని ఆసుపత్రిలో చేర్పించారు.

పురుగుల మందు తాగారంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టెలా.. డాక్టర్ల చేత పూర్తిస్థాయి పరీక్షలు జరిపి.. ముద్రగడ ఎలాంటి పురుగుల మందు తాగలేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఆయన్ను ఆసుపత్రిలో చికిత్స చేసి.. పరిస్థితి సద్దుమణిన తర్వాత సీఐడీ అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
Tags:    

Similar News