వైర‌స్ దారుణం.. తుపాకీతో కాల్చుకున్న‌ పోలీస్!

Update: 2021-07-04 07:34 GMT
క‌రోనా వైర‌స్ త‌ర్వాత అత్యంత దారుణంగా ప్ర‌భావం చూపుతున్న వైర‌స్ బ్లాక్ ఫంగ‌స్‌. క‌రోనా సోకితే సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డే ఛాన్సే ఎక్కువ‌గా ఉంది. కానీ.. ఫంగ‌స్ సోకిన వారికి కంటి చూపు కోల్పోతుండ‌డంతో జీవిత‌మే అంధ‌క‌రంగా మారిపోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మంది జీవితాల‌ను నాశ‌నం చేసింది ఈ మ‌హ‌మ్మారి బ్లాక్ ఫంగ‌స్ వైర‌స్‌.

ఈ ఫంగ‌స్ సోకి చూపు కోల్పోవ‌డంతో.. త‌న జీవిత‌మే వృథా అయిపోయింద‌ని ఆవేద‌న‌కు గురైన ఓ పోలీసు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ దారుణ సంఘ‌ట‌న మహారాష్ట్ర‌లో జ‌రిగింది. ఈ రాష్ట్రంలో నాగ్ పూర్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రమోద్ (46) ఇటీవల కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఆసుప‌త్రిలో చికిత్స తీసుకోవ‌డంతో.. కొవిడ్ వైర‌స్ నుంచి సుర‌క్షితంగానే బ‌య‌ట‌ప‌డ్డాడు కానిస్టేబుల్ ప్ర‌మోద్.

అయితే.. క‌రోనా నుంచి కోలుకున్న‌ప్ప‌టికీ.. బ్లాక్ ఫంగ‌స్ ఆయ‌న్ను వెంటాడింది. ఫంగ‌స్ సోక‌డంతో ఆయ‌న ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ది. కంటి చూపుపై ఫంగ‌స్‌ తీవ్ర ప్ర‌భావం చూపించ‌డంతో.. ప్ర‌మోద్ కుడి కంటిని అనివార్యంగా వైద్యులు తొల‌గించాల్సి వ‌చ్చింది. అయితే.. మిగిలిన కంటికి కూడా ఇన్ఫెక్ష‌న్ సోక‌డంతో.. ఆ కంటి చూపు పోయింది.

రెండు క‌ళ్ల చూపు కోల్పోవ‌డంతో ప్ర‌మోద్ తీవ్రంగా కుంగిపోయాడు. ఇక‌, జీవించి ఉప‌యోగం ఏముంద‌ని తీవ్రంగా మ‌ద‌న‌ప‌డ్డాడు. కుటుంబ స‌భ్యులు ఎంత‌గా ఓదార్చినా.. ఆయ‌న మాన‌సికంగా బాగా కుంగిపోయాడు. దీంతో.. స‌ర్వీస్ తుపాకీతో నోట్లోకాల్చుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు.

ఈ విష‌యం గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు గుండెలు అవిసేలా రోదించారు. క‌రోనా మ‌హ‌మ్మారి త‌మ కుటుంబాన్ని నాశ‌నం చేసింద‌ని క‌న్నీరు మున్నీరుగా విల‌పించారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.
Tags:    

Similar News