పోలీసుల చేతిలో కొత్త ఆయుధం పోకేమాన్

Update: 2016-08-01 07:03 GMT
ప్రపంచానికి పోకేమాన్ ఫీవర్ పట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ ఆట ఆడుకుంటూ ఒళ్లు మర్చిపోతున్నవారు లక్షలాది మంది.. ప్రమాదాలకు గురవుతున్నవారు వందలాది మంది. కానీ.. అదే పోకేమాన్ ను దొంగలను పట్టుకోవడానికి వాడుకోవచ్చని ప్లాన్ చేశారు అమెరికా పోలీసులు. వర్జీనియా రాష్ట్ర పోలీసులు దీనికోసం మంచి ఎత్తుగడ వేశారు. పోకేమాన్ గేమ్ లో బాగా టఫ్ గా ఉండే డిటోను పట్టుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. సో... అలాంటి డిటో తమ స్టేషన్ లో ఉందని.. దాన్ని వచ్చి పట్టుకోవచ్చని వర్జీనియా పోలీసులు తమ ఫేస్ బుక్ పేజిలో ప్రకటించారు. అయితే... ఆ ఛాన్సు అందరికీ కాదని కొందరికేనని ఒక లిస్టు కూడా పెట్టారు. అయితే.. ఆ లిస్టులో కొందరు సాధారణ పౌరులతో పాటు చాలాకాలంగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటున్న  ఎనిమిది మంది నేరగాళ్ల పేర్లూ ఉన్నాయట. పోకేమాన్ పిచ్చిలో వారు డిటో కోసం స్టేషనుకు వస్తే అరెస్టు చేయొచ్చన్నది వర్జీనియా పోలీసుల ప్లాను.

అందుకోసం పోలీస్ స్టేషన్ ప్రాసెసింగ్ రూమ్‌ లోనే నవ్వే పోకెమాన్ బొమ్మను తగిలించింది. ఈ ఆలోచన బాగానే ఉన్నా మరి నేరగాళ్లు అంత ఈజీగా ట్రాప్ లో పడతారా అన్నది అనుమానమే. పోలీసులు ఆశ పడుతున్నట్లుగా నిజంగానే దొంగలు పోకేమాన్  కోసం పోలీసు స్టేషనుకు వస్తే వారిని పిచ్చోళ్లనే అనాలి.  కాగా వర్జీనియాతో పాటు న్యూ హాంప్ షైర్ లోనూ పోలీసులు ఇలాంటి ప్రయోగమే చేశారు.

కాగా వర్జీనియా - న్యూ హాంప్ షైర్ లో నేరగాళ్లెవరూ పోకేమాన్ కోసం వచ్చి దొరకలేదు కానీ డెట్రాయిట్ లో మాత్రం ఇలాంటి ప్రయోగమేమీ చేయకుండానే స్టేషన్ కు వచ్చి దొరికిపోయాడు. పోకేమాన్ గో గేమ్ లో జిమ్ గా చూపించి ఓ పోకేమాన్ ను అందులో లొకేట్ చేయడంతో ఓ వ్యక్తి పోకేమాన్ ను వెతుక్కుంటూ సైకిలుపై స్టేషన్ కు వచ్చేశాడు. చాలాకాలంగా తమకు దొరక్కుండా తప్పించుకుంటున్న నేరస్థుడని గుర్తించిన డెట్రాయిట్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు.  ఈ సంఘటనతోనే మిగిలిన స్టేషన్లవారికి ఈ ఐడియా వచ్చిందట.
Tags:    

Similar News