నోట్ల మార్పిడి కావాలా? ఈ నేతలను కలవండి!!

Update: 2016-12-15 10:16 GMT
పెద్ద నోట్ల మార్పిడిలో ఇన్నాళ్లు బ్యాంకులు - పోస్టాపీసుల సిబ్బందే ఉన్న‌ట్లుగా భావించిన వారికి మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర వార్త వెలుగులోకి వ‌చ్చింది. ఇందులో బ‌డా నాయ‌కులు కూడా ఉన్న‌ట్లుగా తేలింది. దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌ సిఆర్ ప్రాంతంలో పాత నోట్లకు భారీ కమిషన్‌ తో కొత్త నోట్లు అందించే వ్యవహారం పెద్ద ఎత్తున్నే సాగుతోంది. స్ధానిక కాంగ్రెస్ - స‌మాజ్ వాదీ పార్టీ - బ‌హుజ‌న్ స‌మాజ్‌ వాదీ పార్టీ - నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ - జ‌నతాద‌ళ్‌(యూ) తదితర పార్టీలకు చెందిన నేతలు నల్లధనాన్ని తెల్లధనంగా మారుస్తున్న లోపాయికారీ వ్యవహారం ఓ టెలివిజన్ స్టింగ్ ఆపరేషన్‌ లో బట్టబయలైంది. ఈ పార్టీల నేతలు తమతమ కార్యాలయాల్లోనే కూర్చుని 34నుంచి 40శాతం కమిషన్‌ కు పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేస్తున్న తతంగం టెలివిజన్ కెమేరాల్లో చిక్కింది.

ఘజియాబాద్‌ కు చెందిన బ‌హుజ‌న్ స‌మాజ్ వాదీ పార్టీ నాయకుడు వీరేంద్ర జతావ్ పార్టీ ఆఫీసు నుంచే భారీ కమిషన్‌ కు నోట్ల మార్పిడికి పాల్పడినట్టుగా రికార్డయింది.‘పాత నోట్లివ్వండి..35 నుంచి 40శాతం కమిషన్ ఇచ్చి కొత్త నోట్లు తీసుకోండి. అంతా గంటలోనే పూర్తయిపోతుంది’ అని జతవ్ అన్నట్టుగా వీడియో క్లిప్పింగ్‌ లో స్పష్టమైంది. నోయిడాకు చెందిన సమాజ్‌ వాది పార్టీ నాయకుడు టిటు యాదవ్ నగదు మార్పిడికి 40శాతం కమిషన్ అడిగినట్టుగా తెలుస్తోంది. ఇండియా టుడే రిపోర్టర్ రహస్య కెమెరాలో ఈ వ్యవహారాన్ని రికార్డు చేశాడు. కోటి రూపాయల నుంచి పది కోట్ల రూపాయల వరకూ నగదు మార్పిడి చేయాలంటూ వివిధ పార్టీలకు చెందిన నేతల్ని ఈ రిపోర్టర్ సంప్రదించాడు. ‘నేను మిమ్మల్ని ఓ ఎన్‌ జిఓ దక్కరికి తీసుకెళతాను..పనైపోతుంది’అని కాంగ్రెస్ నాయకుడు తారిక్ సిద్ధికి సదరు రిపోర్టర్‌ తో అన్నట్టుగా వీడియో క్లిప్పింగ్‌ లు స్పష్టం చేస్తున్నాయి. అయితే నగదు మార్పిడి జరుగుతుందో లేదో తాను కచ్చితంగా చెప్పలేనని కానీ సదరు ఎన్‌ జిఓ వద్దకు వెళితే పనైపోతుందని మాత్రమే తనకు తెలుసుని కాంగ్రెస్ నేత స్పష్టం చేశాడు.

ఓ బూటకపు కంపెనీకి చెల్లించినట్టుగా మీరిచ్చే మొత్తాన్ని చూపిస్తామని ఎన్‌ సిపి నేత రవికుమార్ సదరు రిపోర్టర్‌ తో అన్నాడు. ఢిల్లీ పుర‌పాల‌క‌ ఎన్నికల్లో మా తరపున ప్రచారం చేయడానికి ఓ కంపెనీ సేవలు వినియోగించుకున్నామని చూపిస్తాం.. ఇబ్బంది ఏమీ లేదని కూడా ఎన్‌ సిపి నేత పేర్కొన్నట్టు తెలుస్తోంది. అలాగే ఆ రిపోర్టర్‌ ను ఎన్‌ సిపి ఢిల్లీ అధ్యక్షుడు కన్వర్ ప్రతాప్ సింగ్‌ కు కూడా పరిచయం చేసినట్టు తెలుస్తోంది. 30 నుంచి 40శాతం కమిషన్ ఇస్తే పాత నోట్లను మార్పిడి చేస్తామని జెడియూ ఢిల్లీ విభాగం ఉపాధ్యక్షుడు సతీష్ సైనీ అన్నట్టుగా కూడా రికార్డయింది. ఈ వీడియోలు ఇపుడు దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News