ఆ గుడికి వెళ్లాడంటే..మోడీ ప‌దవి ఊడిన‌ట్లే !?

Update: 2017-05-16 09:56 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మ‌ధ్య ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ రాష్ట్రంలో అమర్‌ కంటక్‌ లోని నర్మద-ఉద్గమ్‌ స్థల్ పుణ్యక్షేత్రాన్ని సంద‌ర్శించ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఎందుకంటే ఈ దేవాలయాన్ని గతంలో సందర్శించిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సహా అనేక మంది ప్రముఖులు అనతికాలంలోనే తమ పదవులు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మోడీ సాహసించి అమర్‌ కంటక్‌ కు చేరుకొని ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించడం ఆస‌క్తిక‌రంగా మారింది.

1982లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అమర్‌ కంటక్‌ ను సందర్శించారు. ఈ పట్టణాన్ని దర్శించిన రెండేళ్ల‌ తర్వాత 1984లో ఆమె పదవి కోల్పోవాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం సుందర్‌ లాల్ పట్వా 1992 డిసెంబర్‌ లో ఇక్కడ పర్యటించారు. అనంతరం కొద్దికాలానికే సీఎం పదవి నుంచి దిగిపోయారు. 1980-85 వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న అర్జున్‌ సింగ్‌ ను అమర్‌ కంటక్ పర్యటన ఆయనను గద్దె దిగేలా చేసింది. 2004లో మధ్యప్రదేశ్ సీఎంగా ఉన్న ఉమాభారతి ఈ టెంపుల్‌ టౌన్‌ ను సందర్శించిన అనంతరం ప్రత్యర్థి బాబులాల్ గౌర్ పదవికి మార్గం సుగమమైంది. అమర్‌ కంటక్‌ ను సందర్శించిన అనంతరం మాజీ ఉపరాష్ట్రపతి భైరాన్‌ సింగ్ షెకావత్ కూడా తన పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఆయన 2002-07 వరకు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు.

మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామం ఏమంటే...అమర్‌ కంటక్ పుణ్యక్షేత్రానికి వాయు మార్గాన హెలికాప్టర్‌ లో వచ్చి సందర్శించిన నేతలు దాదాపుగా పదవులు కోల్పోయారు. అందుకే ప్రస్తుతం చాలామంది నేతలు రోడ్డు మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే, ప్రధాని మోడీ మాత్రం జబల్‌ పూర్ నుంచి అమర్‌ కంటక్‌ కు హెలికాప్టర్‌ లోనే చేరుకోవ‌డం ఆస‌క్తిక‌రం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News