కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ ఈ ఆదివారం అందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని కోరిన సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ వీడియోలో విషం చిమ్మిన టీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డు కౌన్సిలర్ మహ్మద్ సామీ జనతా కర్ఫ్యూ, ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేశారు. ఇతడి వీడియో మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రధాని నరేంద్రమోడీ జనతా కర్ఫ్యూ వెనుక మతతత్వం ఉందని.. ముస్లింలంతా జనతా కర్ఫ్యూను తీవ్రంగా వ్యతిరేకించాలని మహ్మద్ సామి పిలుపునిచ్చాడు. అంతేకాకుండా ముస్లింలు మసీదులలో ప్రధాని నరేంద్రమోడీకి కరోనా వైరస్ రావాలని ప్రార్థించాలని ఆయన కోరారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అతడి తీవ్ర విమర్శల వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇతడి వ్యాఖ్యలపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి మహ్మద్ సామిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని గృహనిర్బంధంలో ఉంచారు.
కరోనా నియంత్రణ చర్యలను వ్యతిరేకిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఈ క్లిష్ట సమయంలో అందరూ ప్రభుత్వం ఆదేశానుసారం నడుచుకోవాలని.. ధిక్కరిస్తే కేసులు తప్పవని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.