ప‌వ‌న్‌ కు జెడ్ కేట‌గిరి సెక్యురిటీ ఇవ్వాల‌న్న పోసాని

Update: 2018-10-27 07:59 GMT
యాక్ట‌ర్లు డాక్ట‌ర్లు కాలేరు కానీ.. డాక్ట‌ర్లు యాక్ట‌ర్లు కావ‌టం చాలా ఈజీ. అలాంటోళ్లు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే ఉన్నారు. ఇక‌.. రాజ‌కీయ నాయ‌కుల‌కు.. సినిమా యాక్ట‌ర్ల‌కు మ‌ధ్య‌నున్న అనుబంధం ఎక్కువే. సిల్వ‌ర్ స్క్రీన్ వేల్పులు ప‌లువురు పాలిటిక్స్ లో సంచ‌ల‌నాలు సృష్టించిన వైనాల్ని మ‌ర్చిపోలేం.

సినీ రంగానికి చెందిన ప‌లువురు న‌టులు త‌మకున్న పార్టీ అభిమానాన్ని క‌డుపులో దాచుకోకుండా.. బ‌య‌ట‌కు వెళ్ల‌గ‌క్క‌టం.. కీల‌క స‌మ‌యాల్లో వారు బ‌య‌ట‌కొచ్చి.. తాము మ‌ద్ద‌తు ఇచ్చే పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌టం చూస్తున్న‌దే. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్న పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తును సినీ రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు ఇప్ప‌టికే ప్ర‌క‌టించ‌టం తెలిసిందే. మ‌రికొంద‌రు న‌టులు నేరుగా పాద‌యాత్ర‌కు వెళ్లి.. జ‌గ‌న్ తో పాటు కొంత దూరాన్ని న‌డిచినోళ్లు లేక‌పోలేదు.

అలా న‌డిచిన న‌టుల్లో ఒక‌రు పోసాని కృష్ణ‌ముర‌ళి. సినీ ర‌చ‌యిత‌గా కెరీర్ స్టార్ట్ చేసి యాక్ట‌ర్ గా ట‌ర్న్ తీసుకున్న ఆయ‌న మాట‌లు ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. త‌న‌కు అనిపించింది అనిపించిన‌ట్లుగా సూటిగా చెప్పే అల‌వాటున్న పోసానికి ధైర్యం పాళ్లు ఎక్కువ‌నే చెబుతారు. సినిమాల్లో చేసేది క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ పాత్ర‌లైనా..  బ‌య‌ట మాత్రం హీరో మాదిరి తాను అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా చెప్పే స‌త్తా ఎక్కువంటారు.

తాజాగా జ‌గ‌న్ మీద విశాఖ ఎయిర్ పోర్ట్ లో జ‌రిగిన క‌త్తి దాడిపై ఆయ‌న స్పందించారు. ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించారు. ఈ సంద‌ర్భంగా ఒక మీడియా ఛాన‌ల్ లో మాట్లాడిన ఆయ‌న ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌న్న మాట‌ను ఓపెన్ గా చెప్పిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌నుఏపీ స‌ర్కారు సీరియ‌స్ గా తీసుకోలేద‌న్నారు. త‌న‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌న్న అంశంపై ఆయ‌న చేసిన విన‌తినిఏపీ స‌ర్కారు ఇప్ప‌టివ‌ర‌కూ ప‌ట్టించుకోలేక‌పోవ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు.

ప‌వ‌న్ లాంటి కోట్లాది మంది అభిమానులున్న న‌టుడు రాజ‌కీయాల్లోకి రావటం మామూలు విష‌యం కాద‌న్నారు. అత్య‌ధిక పారితోషికం అందుకునే న‌టుల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక‌ర‌ని.. ఆయ‌న అనుకుంటే ఏడాదికి రూ.150కోట్లు సంపాదించే స‌త్తా ఉంద‌న్నారు. కానీ.. అలాంటి ఆదాయాన్ని వ‌దులుకొని.. సినీ రంగంలో ఉండే ల‌గ్జ‌రీల‌ను విడిచి పెట్టి..  ప్ర‌జ‌ల‌కు ఏదో చేయాల‌న్న త‌ప‌న‌తో రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌న్నారు.

ఇప్ప‌టికైనా స‌రే.. ప‌వ‌న్ కానీ డేట్స్ ఇస్తాన‌న్న ఒక్క మాట చెబితే చాలు.. తాను ఎవ‌రూ ఊహించ‌లేనంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌ని పోసాని ప్ర‌క‌టించారు. ప‌వ‌న్ మాట‌ల్లో నిజాయితీ ఉంటుంద‌ని చెప్పిన పోసాని.. ఆయ‌న నిజాలు మాట్లాడుతుంటారు. ఆయన ఏదైనా చెబితే అందులో స‌త్యం ఉంటుంది. త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని ఆయ‌న నోటితో ఆయ‌నే చెప్పారంటూ అందులో నిజం ప‌క్కాగా ఉంటుంది. అలాంటి ప‌వ‌న్‌కు జెడ్ కేట‌గిరి సెక్యురిటీని క‌ల్పించాల్సిన బాధ్య‌త ఏపీ స‌ర్కారుకు ఉంద‌ని వ్యాఖ్యానించారు. మ‌రి.. పోసాని మాట‌ల‌కు ఏపీ ప్ర‌భుత్వం ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి.

Tags:    

Similar News