అమ్మాయిలు బైక్‌ న‌డిపితే కాల్చేస్తారు

Update: 2016-08-01 10:17 GMT
కాశ్మీర్‌లో పదిహేను రోజులుగా జరుగుతున్న అల్లర్లు విపరీత ధోరణులు చోటుచేసుకుంటున్నాయి. వీటిల్లో మతోన్మాద శక్తులు ప్రవేశించి బాలికలు, వ్యాపారులు లక్ష్యంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. శ్రీనగర్ నడిబొడ్డున తాజాగా వెలసిన పోస్టర్లే ఇందుకు నిదర్శనం. ‘బాలికలూ... స్కూటీ లాంటి ద్విచక్ర వాహనాలు నడపకండి. వాహనం నడుపుతూ కనపడితే వాహనంతో పాటు మిమ్మల్నీ దహనం చేస్తాం’ - ఇదీ శ్రీనగర్‌ లో దర్శనమిచ్చిన పోస్టర్ల సారాంశం.

సంగ్‌ బాజ్ (స్టోన్ పెల్టర్స్) అసోసియేషన్ జమ్మూ కాశ్మీర్’ అనే సంస్థ పేరుమీద బాలికలను - దుకాణ యజమానులను హెచ్చరిస్తూ పోస్టర్లు దర్శనమిచ్చాయి. వాహనం నడిపే బాలికలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర హెచ్చరికలు చేసిన ఈ పోస్టర్లలో దుకాణ యజమానులు - చిరు వ్యాపారులు - బ్యాంకులను కూడా ఈ సంస్థ లక్ష్యంగా చేసుకుంది. ఈ పోరాటం ముగిసే వరకూ దుకాణాలు - బ్యాంకులు మూసివుంచాలని - ఇదే చివరి హెచ్చరిక అని ఆ పోస్టర్‌ లో స్పష్టం చేసింది. పోరాటం ముగిసిపోయే వరకూ దుకాణాలను మూసి వుంచాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. ప్రైవేటు రవాణా ఆపరేటర్లు తమకు సహకరించాలని పేర్కొంది. మసీదుల్లో ప్రార్థనల అనంతరం నినాదాలు చేయాలని మసీదు యాజమాన్య కమిటీలకు సంగ్‌ బాజ్ సంస్థ ఆ పోస్టర్లలో పిలుపునిచ్చింది. కాగా, ఈ పోస్టర్లపై సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మాట్లాడుతూ ఈ పోస్టర్ల ప్రచారం వెనుకనున్న వారి కోసం ఆరా తీస్తున్నామని తెలిపారు.
Tags:    

Similar News