పవర్ హాలిడే మరో వారం తప్పదా ?

Update: 2022-04-23 05:30 GMT
రాష్ట్రంలో కరెంటు కష్టాల వల్ల పరిశ్రమలకు పవర్ హాలిడే మరో వారంరోజుల పాటు తప్పేట్లు లేదు. మండుతున్న ఎండల కారణంగా రాష్ట్రంలో విద్యుత్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడింది.

అయితే అవసరాలకు తగ్గట్లుగా విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కావట్లేదు. ఎందుకంటే బొగ్గు సరఫరా లేని కారణంగా బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. అందుకనే ప్రభుత్వం ముందు జాగ్రత్తగా పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించింది.

మామూలు ఇళ్ళు, ఆఫీసులకన్నా పరిశ్రమలకు ఎక్కువ విద్యుత్ అవసరమవుతుంది. అందుకనే ముందు పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించింది. పవర్ హాలిడే కారణంగా పరిశ్రమలకు తగ్గించిన  విద్యుత్ ను ఇళ్ళకు సరఫరా చేస్తోంది. అయితే ఇళ్ళల్లో వాడే విద్యుత్ డిమాండ్ కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లుంది. పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించిన కారణంగా రోజుకు 20 మిలియన్ యూనిట్లు ఆదా అవుతోంది.

అయితే ఆదా అవుతున్న కరెంటు కూడా సరిపోవటం లేదు. ఎందుకంటే చాలా ఇళ్ళల్లో ఏసీలు లేదా ఎయిర్ కూలర్లు, ఆఫీసుల్లో కూడా ఏసీలు, కూలర్లు వాడేస్తున్నారు. దీనివల్ల ఇళ్ళు, ఆఫీసులకు వాడే కరెంటు డిమాండ్ కూడా బాగా పెరిగిపోతోంది. మనకు మామూలుగా బొగ్గు రష్యా, ఉక్రెయిన్ నుండి వస్తుంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా బొగ్గు ఆగిపోయింది.

ఆస్ట్రేలియా, ఇండోనేషియాలు బొగ్గు ధరలను విపరీతంగా పెంచేశాయి. ఎంత ధరపెట్టినా కొందామని కేంద్రం ఎంత ప్రయత్నం చేస్తున్నా బొగ్గు దొరకటం లేదు. దీనివల్ల దేశంలోని చాలా రాష్ట్రాలు కరెంటు కష్టాలను ఎదుర్కోక తప్పటం లేదు.

గుజరాత్ లాంటి రాష్ట్రాలు కూడా పవర్ హాలిడే ప్రకటించేశాయి. ఢిల్లీ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణా, కేరళ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కూడా కరెంటు ఉత్పత్తి బాగా తగ్గిపోవటంతో కోతలు తప్పటం లేదు. మరీ సమస్య ఎప్పుడు తీరుతుందో ఏమో.
Tags:    

Similar News