రెడ్డి వర్సెస్ చౌదరి... టీడీపీకి అనంత కష్టాలు

Update: 2022-09-20 17:30 GMT
తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. పైగా గతం కంటే కొంత నీరసించి ఉంది. ఈ టైమ్ లోనే గట్టిగా పుంజుకోవాలి. అధికారంలో ఉంటే అసంతృప్తులు సహజం. పదవులు అన్నీ అందరికీ పంచిపెట్టడం సాధ్యం కాదు కాబట్టి చాలా మంది అలక పానుపు ఎక్కే సీన్ ఉంది. అయితే ఓడిన పార్టీలో కసి ఉండాలి. ఎలాగోలా ముందు అధికారం దక్కించుకుంటే ఆనక మిగిలిన విషయాలు అని ఎవరైనా భావించాలి

కానీ ఈ కసి పట్టుదల అంతా చంద్రబాబులోనే ఎక్కువగా ఉంది. కానీ పార్టీని కష్టకాలంలో మోయాల్సిన కీలక నాయకులు కానీ సీనియర్లు కానీ తమ బాధ్యత ఏమిటి అన్నది విస్మరించి తగాదాలకు దిగుతున్నారు. వీధి పోరాటాలకు సై అంటున్నారు. అనంతపురం జిల్లా సహజంగా టీడీపీకి పట్టున్న జిల్లా. 2019 ఎన్నికల్లో వైసీపీ ఊపు జగన్ క్రేజ్ ఆ జిల్లాలో సైకిల్ కి బ్రేకులేశాయి. మొత్తం సీట్లలో రెండంటే రెండు మాత్రమే టీడీపీకి దక్కింది.

మిగిలిన సీట్లు అన్నీ వైసీపీ ఖాతాలోకి వెళ్ళిపోయాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని టీడీపీ గట్టి పట్టుదలగా ఉంది. దాని కోసం నేతలను అందరినీ ఒకే త్రాటి మీదకు తేవడానికి చంద్రబాబు గట్టి కసరత్తే చేస్తున్నారు. కానీ అనంతపురం జిల్లాలో జేసీ వర్సెస్ ప్రభాకర చౌదరిగా సాగుతున్న పోరు కొంప ముంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

కాంగ్రెస్ లో జేసీలు ఉన్నపుడు ప్రభాకర చౌదరి టీడీపీలో చక్రం తిప్పేవారు. అపుడు ఇద్దరి మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లుగా సీన్ ఉండేది.  కానీ 2014కి ముందు జేసీ బ్రదర్స్ టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. నాటి నుంచి పార్టీ ఒక్కటైనా మనసులు మాత్రం కలవడంలేదు. అయినా నాడు టీడీపీ వేవ్ లో అంతా గెలిచారు. 2019 నాటికి విభేదాలు ముదిరి కత్తులు నూరుకోవడంతో అంతా ఓడారు. మరి 2024 నాటికి అంతా కలవాలి. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అవుతోంది.

జేసీ ప్రభాకరరెడ్డి వర్సెస్ ప్రభాకర చౌదరిగా అనంతపురం అర్బన్ సీట్లో అతి పెద్ద పోరాటమే సాగుతోంది. ఈ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది అని తమ్ముళ్లే చెబుతున్నారు. దానికి ఉదాహరణగా తాజా ఉదంతం ఉంది. ఇద్దరూ కలసి ఎవరి వర్గాల వారీగా బాదుడే బాదుడు ప్రొగ్రాం అనంతపురం అర్బన్ లో నిర్వహించారు. దాంతో రచ్చ రచ్చ అయింది. ఇరు వర్గాలను కంట్రోల్ చేయడానికి పోలీసులు దిగాల్సి వచ్చింది.

ఇక అనంతపురం అర్గన్ ఇంచార్జిగా వైకుంఠం ప్రభాకర చౌదరి ఉండగా మీరెందుకు ఇక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అని జేసీ ప్రభాకరరెడ్డి వర్గీయుల మీద చౌదరి వర్గీలులు మాటల దాడి చేస్తున్నారు. అయితే దానికి ప్రభాకరరెడ్డి అనుచరుల వద్ద మరో లాజిక్ పాయింట్ ఉంది. ఏకంగా అనంతపురం పార్లమెంట్ టీడీపీ సీటుకు జేసీ పవన్ ఇంచార్జి అని అందువల్ల తాము కూడా అర్బన్ లో పార్టీ కార్యక్రమాలు చేపట్టవచ్చు అని ప్రభాకరరెడ్డి వర్గీయులు బదులిస్తున్నారు.

అనంతపురం రావాలంటే ఎవరి అనుమతి తమకు అవసరం లేదని, తమకు అసలు ఎవరూ ఆపలేరని కూడా ప్రభాకరరెడ్డి వర్గీయులు బల్ల గుద్దుతున్నారు. దాంతోనే వివాదం హెచ్చుతోంది. దీంతో ఈ పోరు ఎవరూ తీర్చలేనిదిగా ఉంది. ఇక ఈ రెండు వర్గాల మధ్య రాజుకున్న మంటతో పోలీసులు అప్రమత్తమై సెక్షన్ 30 ని అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఎవరూ సభలు సమావేశాలూ నిర్వహించరాదని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే పార్టీలో విభేదాలు రెచ్చగొడుతూ పార్టీ నేతల ఓటమికి కారణం అవుతున్న ప్రభాకర్ చౌదరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రభాకరరెడ్డి వర్గం ఒక తీర్మానం చేసి అగ్గి రాజేసింది. గత ఎన్నికల్లో పరిటాల శ్రీరాం ని కూడా ప్రభాకర చౌదరి ఓడించారని కొత్త విషయం చెబుతోంది.

ఇక దీనిమీద ఇపుడు ప్రభాకర చౌదరి వర్గం రెస్పాండ్ కావాల్సి ఉంది. వారు కూడా జేసీ ఫ్యామిలీ మీద ఆరోపణలు చేస్తూ వారిని పార్టీ నుంచి లేకుండా సస్పెండ్ చేయాలని కోరుతారా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి అటూ ఇటూ బలమైన వారే. ఒకటీ ఒకటీ కలిస్తే రెండు అవుతాయని రాజకీయం పండుతుందని చంద్రబాబు భావిస్తూంటే కధ అడ్డం తిరుగుతోంది. దాంతో రెడ్డి వర్సెస్ చౌదరితో అనంత కష్టాలు టీడీపీని చుట్టుముడుతున్నాయి అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News