ప్రణబ్ బయోగ్రఫీ ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్’పై వివాదం

Update: 2020-12-15 16:30 GMT
భారత దేశ రాజకీయాలలో మాజీ రాష్ట్రపతి దివంగత ప్రణబ్ ముఖర్జీ తనకంటటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయిన ప్రణబ్ కు ఆ పార్టీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన ప్రణబ్ దా...భారత రాష్ట్రపతిగా సేవలందించి ఆ పదవికే వన్నె తెచ్చారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ప్రణబ్...తన జీవితానుభవాలను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో తన బయోగ్రఫీకి అంకురార్పణ చేశారు. ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్’ పేరిట ప్రణబ్ స్వయంగా వెల్లడించిన విషయాలకు రూా పబ్లికేషన్స్ అనే పుస్తక రూపం కల్పించింది. వచ్చే నెల ఆ పుస్తకం విడుదల కాబోతున్న నేపథ్యంలో ఓ వివాదం తెరపైకి వచ్చింది. తనకు ఈ పుస్తకం చూపించిన తర్వాతే పబ్లిష్ చేయాలని, అప్పటివరకు ఈ పుస్తకాన్ని విడుదల చేయవద్దని ప్రణబ్ తనయుడు అభిజిత్ ముఖర్జీ పట్టుబడుతున్నారు. మరోవైపు, ఈ బుక్ విడుదల చేయాల్సిందేనంటూ ప్రణబ్ దా కుమార్తె శర్మిష్ట ముఖర్జీ అంటున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రణబ్ వారసులు ఈ పుస్తకం విడుదలపై అభ్యంతరం వ్యక్తం చేసుకోవడం చర్చనీయాంశమైంది.

తమ తండ్రి దివంగతుడైనందున ఈ పుస్తకం ఫైనల్ కాపీని తాను చూడాలనుకుంటున్నానని, తమ తండ్రికి సంబంధించిన కొన్ని విషయాలను పబ్లిషర్ కావాలనే మీడియాకు లీక్ చేశారని అభిజిత్ ఆరోపిస్తున్నారు. ఈ రోజు ప్రణబ్ జీవించి ఉంటే ఆయన కూడా ఈ పుస్తకం విడుదలను వ్యతిరేకించి ఉండేవారని అభిజిత్ అన్నారు. తన లిఖిత పూర్వక ఆమోదం లేకుండానే కొన్ని విషయాలు ఓ వర్గం మీడియాకు లీక్ అయ్యాయని, ఈ బుక్ పబ్లిషింగ్ ను వెంటనే నిలిపివేయాలన్నారు. అయితే, తన సోదరుడి అభ్యంతరాలపై శర్మిష్ట అభ్యంతరం వ్యక్తం చేశారు. పుస్తక ప్రచురణకు అనవసరమైన అడ్డంకులు సృష్టించవద్దంటూ అభిజిత్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. తమ తండ్రి మరణించే ముందు ఈ పుస్తకం మాన్యు స్క్రిప్ట్ ని పూర్తి చేశారని, తుది డ్రాఫ్ట్ లో ప్రణబ్ చేత్తో రాసిన కామెంట్స్ ఉన్నాయని అన్నారు. ఈ పుస్తకంలోని అభిప్రాయాలు ప్రణబ్ సొంతవని, ఇందులో ఎవరూ జోక్యం చేసుకోకూడదని శర్మిష్ట అన్నారు. మరోవైపు, ఈ పుస్తకంలో కాంగ్రెస్ పై, ప్రధాని మోడీ సర్కార్ పై ప్రణబ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ల మధ్య చాలా తేడా ఉందంటూ తన అభిప్రాయాలను ప్రణబ్ వ్యక్తం చేశారు. తాజాగా ఈ పుస్తకంపై తన తండ్రి పుస్తకంపై ప్రణబ్ వారసుల రచ్చ నేపథ్యంలో ఈ పుస్తకం విడుదలవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News