ఒబామా కారులో కలిసి వెళదామంటే ప్రణబ్ దా స్పందన ఇదే

Update: 2020-12-12 04:40 GMT
ప్రముఖుల ఆత్మకథల కారణంగా.. అప్పటివరకు బయటకు రాని ఎన్నో అంశాలు బయటకు వస్తుంటాయి. అయితే.. ఆత్మకథ అన్నది సంచలనాల కోసమో.. తమ గొప్పల గురించి చెప్పుకోవటం కోసమో రాస్తే దాని వల్ల ఎలా ప్రయోజనం ఉండదు. అందుకు భిన్నంగా.. నిజాయితీగా జరిగిన అంశాల్ని జరిగినట్లు.. అసలేం జరిగిందన్న వివరాల్నివెల్లడిస్తే.. దాని విలువే వేరుగా ఉంటుంది. తాజాగా దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథలో పలు కీలక అంశాల్ని వెల్లడిస్తున్నట్లుగా తెలుస్తోంది. తనను రాష్ట్రపతి స్థానంలో కూర్చోబెట్టిన కాంగ్రెస్ పార్టీ గురించి.. ప్రధాని మోడీతో పాటు.. తాను రాష్ట్రపతిగా వ్యవహరించిన కాలంలో జరిగిన విషయాల మీద నిర్మోహమాటంగా పుస్తకంలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది.

వచ్చే జనవరిలో బయటకు వచ్చే ఈ పుస్తకంలోని కొన్ని అంశాల్ని తాజాగా పబ్లిషర్స్ బయటకువిడుదల చేశారు. దీంతో.. ఈ పుస్తకం హాట్ టాపిక్ గా మారి.. దాని కోసం చర్చజరిగేందుకు అవకాశం ఉన్న కొన్ని అంశాల్ని వారు వెల్లడించినట్లుగా చెప్పాలి. ప్రధాని మోడీ పాలన మీదా.. ఆయన తొలి ఐదేళ్ల పాలన మీద ప్రణబ్ దా ఏమనుకునే వారు? ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారన్న విషయంతో పాటు.. తాను రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న సమయంలో భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడికి (ఒబామా) సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు.

ప్రధాని మోడీ విషయానికి వస్తే.. మన్మోహన్ ప్రధానిగా ఉన్న కాలంలో ఆయన వ్యవహారశైలికి.. మోడీకి మధ్య వ్యత్యాసాన్ని వెల్లడించటమే కాదు.. మోడీ పాలనా విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారనే చెప్పాలి. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు కూటమిని రక్షించుకోవటంలోనే ఆయన తలమునకలైపోతే.. ప్రధాని మోడీ మాత్రం తన ఐదేళ్ల పదవీ కాలంలో నియంతృత్వ విధానాన్నే అనుసరించినట్లే ఉందన్నారు. ఆ సమయంలో ప్రభుత్వం.. చట్టసభలు.. న్యాయవ్యవస్థ మధ్య చేదు సంబంధాలు నెలకొన్నట్లుగా పేర్కొన్నారు.

ఈ విషయంలో ఆయన రెండో దఫా పాలనలో మరింత బాగా అర్థమవుతుందా? లేదా? అన్నది కాలమే చెబుతుందన్నారు. ఇక.. 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు భారత్ లో పర్యటించారని.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న ఈ అంశాన్ని ప్రణబ్ దా వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు తన కారులో కూర్చోవాలని తనను కోరినట్లుగా ప్రణబ్ దా పేర్కొన్నారు. ‘‘నేను.. గౌరవంగా.. గట్టిగా తిరస్కరించాను. అమెరికా అధ్యక్షుడు.. భారత రాష్ట్రపతితో కలిసి ప్రయాణించేటప్పుడు భారత ప్రభుత్వ భద్రతా ఏర్పాట్లను విశ్వసించాలి. ఇదే విషయాన్ని అమెరికా అధికారులకు చెప్పమని విదేశీ వ్యవహారాల శాఖకు చెప్పాను’’ అని తన ఆత్మకథలో పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయాణంలో చోటు చేసుకున్న ఎన్నో ముఖ్యాంశాల్నిప్రణబ్ తన ఆత్మకథలో పేర్కొన్నట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News