ఈ పీకే... 2019 పోల్స్ ఫ‌లితాల నిర్దేశ‌కుడు!

Update: 2017-07-06 04:14 GMT
పీకే అంటే... వెంట‌నే గుర్తుకు వ‌చ్చేది టాలీవుడ్ స్టార్ హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణే క‌దా. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లోనే రాజ‌కీయ పార్టీని పెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌... నాడు టీడీపీ - బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తుగా నిలిచి కాళ్ల‌కు బ‌ల‌పం క‌ట్టుకున్న‌వాడ‌ల్లే తిరిగారు. ప‌వ‌న్ అభిమానులు - రుణ‌మాఫీ అంటూ టీడీపీ చేసిన‌ సాధ్యం కాని వాగ్దానంతో 13 జిల్లాల‌లో అవ‌శేష ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ గా ఏర్ప‌డ్డ నవ్యాంధ్ర‌కు ఆ పార్టీ అదినేత నారా చంద్ర‌బాబునాయుడు సీఎంగా ఎన్నిక‌య్యారు. స్వ‌ల్ప మార్జిన్ల‌తో వైసీపీ విజ‌యానికి అంగుళం దూరంలో నిలిచిపోయింది. అంటే నాడు టీడీపీ విజ‌యంలో పీకేగా మ‌నం పిలుచుకునే ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క పాత్రే పోషించారు. అయితే ఆ పీకే ఇప్పుడు టీడీపీ - బీజేపీ కూట‌మికి మ‌ద్దతిస్తారా?  లేదంటే జ‌న‌సేన పేరిట సొంతంగా ఏర్పాటు చేసుకున్న పార్టీతో ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతారా? అన్న విష‌యంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ క్లారిటీ కంటే ముందుగానే ఇప్పుడు తెలుగు నేల రాజ‌కీయాల్లోకి మ‌రో పీకే దూసుకువ‌చ్చేశారు. మ‌న పీకే కేవ‌లం ఓ రాష్ట్రానికి సీఎంను గెలిపించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తే... ఇప్పుడు రంగప్ర‌వేశం చేసిన పీకే... మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏకంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీనే గెలిపించేశారు. దీనిని బ‌ట్టి మ‌న పాత పీకే కంటే కూడా... ఈ కొత్త పీకేనే మోర్ ప‌వ‌ర్‌ ఫుల్ అన్న‌మాట‌. అయినా... ఈ కొత్త పీకే ఎవ‌రనేగా మీ ప్ర‌శ్న‌? ఇంకెవ‌రండీ బాబూ... గ‌డ‌చిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీకి పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్‌ గా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాకుండా... మోదీ ప్ర‌చారాన్ని ప‌తాక స్థాయికి తీసుకెళ్లిన రాజ‌కీయ విశ్లేష‌కుడు ప్ర‌శాంత్ కిషోరే. ఉన్న‌త చ‌దువులు చ‌దివి... ఉద్యోగ నిమిత్తం విదేశాల‌కు వెళ్లిపోయిన ప్ర‌శాంత్ కిషోర్‌... గ‌డ‌చిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు దేశానికి తిరిగివ‌చ్చేశారు.

బీహార్‌కు చెందిన ఈయ‌న రాగానే... మోదీ దృష్టిని ఆక‌ర్షించేశారు. ఫ‌లితంగా వ‌చ్చీరాగానే బీజేపీకి పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించేశారు. త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ పీకే... తాను ప‌నిచేస్తున్న పార్టీకి విజ‌యాన్నందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తారు. ఇందుకు నిద‌ర్శ‌న‌మే... కేంద్రంలో మోదీకి అదికారం - బీహార్‌ లో వ‌రుస‌గా మూడో సారి కూడా నితీశ్ కుమార్‌ కే ప‌ద‌వీ ప‌గ్గాలు ద‌ఖ‌లుప‌డ్డాయి. మోదీ విజ‌యంలో కీల‌క భూమిక పోషించిన ప్ర‌శాంత్‌... ఒక్క‌సారిగా దేశ‌వ్యాప్తంగా ప్ర‌ముఖ వ్య‌క్తిగా మారిపోయారు. తాజాగా ఏపీలో విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ గా ప‌నిచేసేందుకు ఆయ‌న‌ అంగీక‌రించారు. చాలా కాలం క్రిత‌మే ఈయ‌న జ‌గ‌న్ వ‌ద్ద బాధ్య‌త‌లు స్వీకరించ‌గా... వైసీపీ నేత‌ల‌తో నిన్న తొలిసారి సుదీర్ఘ భేటీని నిర్వ‌హించారు.

జ‌గ‌న్ స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ స‌మావేశంలో పార్టీ బ‌లాబలాలు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌నం నాడి, ఇప్ప‌టిక‌ప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే... వైసీపీకి ఎన్ని సీట్లు వ‌స్తాయి? అదే స‌మ‌యంలో అధికార టీడీపీకి ఎన్ని సీట్లు ద‌క్కుతాయి అన్న విష‌యాల‌పై ఆయ‌న స‌మ‌గ్రంగా వివ‌రించినట్లు స‌మాచారం. అంతేకాకుండా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీ మ‌రింత బ‌లోపేతం కావాల‌ని, అందుకు అనుస‌రించాల్సిన వ్యూహాన్ని ఆయ‌న జ‌గ‌న్ అండ్ కోకు దిశానిర్దేశం చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. జాతీయ రాజ‌కీయాల‌కు సంబంధించి జ‌నం నాడిని ప‌ట్టేసిన ఈ పీకేకు... ఏపీలో జ‌నం నాడి ప‌ట్ట‌డంతో పెద్ద‌గా ఇబ్బందేమీ ఉండ‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది. అంతేకాకుండా కేవ‌లం రాష్ట్ర రాజ‌కీయాల వ‌ర‌కు మాత్ర‌మే మ‌న పీకే ప‌రిమితం కాగా... తొలి అడుగే జాతీయ రాజ‌కీయాల్లో వేసి, తొలి దెబ్బ‌కే గ్రాండ్ ఓల్డ్ పార్టీకి భారీ దెబ్బ కొట్టేశారు. సో... తెలుగు నేల పాలిటిక్స్ లోకి తాజాగా దూసుకువ‌చ్చిన ఈ పీకేనే... మ‌న పీకే కంటే మోర్ ప‌వ‌ర్ ఫుల్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News