ప్ర‌శాంత్ కిశోర్ టీమ్‌.. ఏపీలో అడుగు పెట్టే ధైర్యం లేదా?

Update: 2021-12-15 09:30 GMT
ప్ర‌శాంత్ కిశోర్‌. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌రలేదు. జాతీయ రాజ‌కీయాల నుంచి రాష్ట్రాల రాజ‌కీ యాల వ‌ర‌కు పీకేగా సుప‌రిచితుడైన ఆయ‌న రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా గుర్తింపుపొందాడు. 2014లో ప్ర‌ధాన మంత్రి కావాల‌న్న న‌రేంద్ర మోడీ తీసుకువ‌చ్చిన యువ మేధావిగా ప్ర‌శంస‌లు పొందాడు.

అప్ప‌టి ఎన్నిక‌ల్లో మోడీ విజ‌యం త‌ర్వాత‌.. ఇక‌, పీకే తిరిగి చూసుకునే అవ‌కాశం లేకుండా పోయింది. ఇదిలావుంటే.. 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో విజ‌యం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నించిన వైసీపీకి అన్నీ తానై.. న‌డిపించాడు.

2019లో జ‌గ‌న్ పాద‌యాత్ర‌, ఇంటింటి ప్ర‌చారం.. సామాజిక వ‌ర్గాల పోల‌రైజేష‌న్‌.. ఇలా అనేక రూపాల్లో పీకే.. వైసీపీకి సాయం చేసిన విష‌యం తెలిసిందే. మొత్తానికి జ‌గ‌న్‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చాడు.

ఆ త‌ర్వాత‌.. కూడా పీకే సేవ‌లు.. జ‌గ‌న్‌కు అందుతున్నాయ‌నే అంటున్నారు. మ‌రోవైపు.. ఇప్ప‌టి నుంచే వ‌చ్చే 2024 ఎన్నిక‌ల‌పై జ‌గ‌న్ ఫోక‌స్ పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మ‌రోసారి..పీకేను.. రంగంలోకి దింపాల‌ని నిర్ణ‌యించార‌ని.. కొన్నాళ్లుగా వార్త‌లు వ‌చ్చాయి. మ‌ధ్య‌లో పీకే వ‌చ్చి తాడేప‌ల్లిలోని సీఎంతో భేటీ కావ‌డం.. కూడా తెలిసిందే.

దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి వైసీపీని గ‌ద్దెనెక్కించేందుకు పీకే ప్ర‌య‌త్నిస్తార‌ని.. ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాదు.. న‌వంబ‌రులోనే పీకే రంగంలోకి దిగిపోతుంద‌ని.. అన‌ధికార వ‌ర్గాలు సైతం ప్ర‌చారం చేశాయి.

అంటే.. సీఎం స్వ‌యంగా మంత్రుల‌తోనే అన్న‌ట్టుగా అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఇదే విష‌యంపై.. మీడియా కూడా భారీ ఎత్తున ప్ర‌చారం చేసింది. అయితే.. న‌వంబ‌రు మాట అటుంచితే.. డిసెంబ‌రు వ‌ర‌కు కూడా పీకే టీం ఊసు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. అంటే.. దీని వెనుక ఏదో జ‌రిగింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ క్ర‌మంలో పీకే టీం.. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ వాళ్ల‌తో కూడా మిలాఖ‌త్ అయ్యారు. అక్క‌డ కూడా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు పీకే బృందం ప్ర‌య‌త్నిస్తోంద‌నే విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో ఇంటింటి స‌ర్వే చేసేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని స‌మాచారం. అయితే.. ఏపీలో ఎందుకు స‌ర్వే ప్రారంభించ‌లేదు అనేది ప్ర‌శ్న‌. వాస్త‌వానికి న‌వంబ‌రులోనే ప్రారంభ‌మ‌వుతుంద‌ని చెప్పినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు చేప‌ట్టలేదు.. అంటే.. ఎమ్మెల్యేలు బాగా ఆవేశంతో ఉన్నార‌ని.. గ్రామాల్లో తిర‌గ‌లేమ‌ని చెబుతున్నార‌ని.. పీకే టీం భావిస్తోంది.

ఈ క్ర‌మంలో స‌ర్వేలు చేస్తే.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా రిపోర్టు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. కొంత స‌మ‌యం తీసుకుని స‌ర్వే చేస్తే బెట‌ర్ అని ఎమ్మెల్యేలు భావిస్తోంద‌ట‌! ఇదిలావుంటే.. మ‌రో రీజ‌న్ ఏంటంటే.. అస‌లు వైసీపీ ఎమ్మెల్యేల‌కే.. పీకే టీంపై గుస్సా ఉంద‌ని.. వారికి ఆగ్ర‌హం ఉన్న విష‌యం పీకేకు కూడా తెలుసున‌ని.. ఈ క్ర‌మంలో కూడా టీం ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింద‌నే వాద‌న ఉంది. ఇంకొక‌టేంటంటే.. ఇప్పుడు గ్రామాల్లో అంద‌రూ డిగ్రీలు చ‌దివిన వారే కాబ‌ట్టి.. మాకు చెప్పేంత సీన్ లేద‌ని.. అనే ఛాన్స్ కూడా ఉంది.

ఈ క్ర‌మంలో వైసీపీ ఎమ్మెల్యేలు.. ఏమైనా మాట్లాడినా.. వారిని తిర‌గ‌నిచ్చే ప్ర‌స‌క్తి కూడా ఉండ‌ద‌ని భావిస్తున్నారు. లోక‌ల్‌గా కొన్ని స‌మ‌స్య‌లు కూడా సృష్టిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఇప్ప‌టికిప్పుడు.. పీకే టీం ఏపీలో దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని చెబుతున్నారు. అందుకే స‌ర్వే విష‌యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా వేస్తున్నార‌ని.. ఒక టాక్ న‌డుస్తోంది. ఏదేమైనా..మ‌రో రెండున్న‌రేళ్ల స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడే స‌ర్వే చేసినా, ప్ర‌యోజ‌నం ఏంట‌నేది కూడా ఒక టాక్ న‌డుస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News