దేశంలోనే యంగెస్ట్ సీఎం నారా లోకేష్!

Update: 2018-04-12 05:02 GMT
అదేమిటి అప్పుడే నారా లోకేష్ సీఎం అయిపోయాడా? చంద్రబాబు ఇంకా పాలన సాగిస్తూనే ఉన్నారు కదా.. అని మీరు నివ్వెర పోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ మంత్రులు లోకేష్ ను అప్పుడే సీఎం చేసేస్తున్నారు. పైగా దేశంలోనే యంగెస్ట్ సీఎం అనే కితాబుకు అర్హుడిని కూడా చేసేస్తున్నారు. ప్రస్తుతం 35 ఏళ్ల ప్రాయంలో ఉన్న మరో మూడేళ్లలోగానే ముఖ్యమంత్రి అయితే తప్ప.. యంగెస్ట్ సీఎం అనే కితాబును దక్కించుకోలేరు. కానీ.. తెదేపా మంత్రులు ఇప్పుడే అలా ప్రకటించేస్తున్నారంటే.. దాని వెనుక మర్మం ఏదో దాగున్నదన్నమాటే!

గుంటూరు జిల్లాలో బుధవారం నాడు ఒక కార్యక్రమంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. ఒక రేంజిలో రెచ్చిపోయారు. ఆ కార్యక్రమంలో నారా లోకేష్ ను ఆకాశానికి ఎత్తేశారు. లోకేష్ ఈ దేశంలో అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ డప్పు కొట్టారు. అంతా బాగానే ఉంది. కానీ ఎలా సాధ్యం అనేదే ప్రజల ముందున్న ప్రశ్న.

ఇప్పటిదాకా యంగెస్ట్ సీఎం బిరుదు యూపీ నేత అఖిలేష్ యాదవ్ పేరిట ఉంది. 1973లో పుట్టిన ఆయన 38 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. లోకేష్ 1983లో పుట్టారు. ప్రస్తుతానికి ఆయన వయసు 35 ఏళ్లు. అంటే మూడేళ్లలోగా సీఎం అయితే తప్ప.. అఖిలేష్ రికార్డును బద్దలు కొట్టడం లోకేష్ కు సాధ్యం కాదు.

మూడేళ్లలో ఏం మాజిక్ జరుగుతుందని పత్తిపాటి పుల్లారావు లాంటి మంత్రులు  భావిస్తున్నారో మనకు తెలియదు. చంద్రబాబునాయుడు తాను రాష్ట్ర రాజకీయాలను దాటి ఎన్నటికీ, ఎన్ని అవకాశాలు వచ్చినా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని పలుమార్లు ప్రకటించారు. పైగా తనకు గతంలో ప్రధాని అయ్యే అవకాశాలు వచ్చినప్పుడు స్వయంగా నారా లోకేష్ తనను ఆపారని, రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే చాలని చెప్పారని కూడా చంద్రబాబు కితాబులు ఇచ్చారు. ఆ లెక్కన ఆయనకు ఢిల్లీ పదవులపై మమకారం లేనట్టే లెక్క. మరి 2019 ఎన్నికల అనంతరం తెదేపా అధికారంలోకి వస్తే గనుక.. చంద్రబాబును పక్కన పెట్టి లోకేష్ ను సీఎం చేయాలని పుల్లారావు లాంటి వాళ్లు ఆలోచిస్తున్నారా అనేది కూడా అర్థం కావడం లేదు.

మరోవైపు 2019 ఎన్నికల్లో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి గనుక అధికారంలోకి వస్తే.. లోకేష్ కల కల్లఅయినట్లే. ఎందుకంటే.. 2024లో మళ్లీ తెదేపా గెలుస్తుందని అనుకున్నా సరే.. ఈలోగా లోకేష్ కు 40 ఏళ్లు వచ్చేస్తాయి. అతి పిన్న వయస్కుడైన సీఎం అనే రికార్డు పోతుంది. మరి అలా పొగుడుతున్న మంత్రిగారి లెక్కేమిటో చంద్రబాబుకే తెలియాలి.

Tags:    

Similar News