కొత్త ఏడాది స‌రికొత్త రీఛార్జ్ మీకు త‌ప్ప‌దంతే!

Update: 2018-12-25 05:13 GMT
అవును.. మీరు త‌ప్పుగా విన‌లేదు. ఇప్ప‌టికే ఎన్నో అవ‌స‌రాల‌కు రీఛార్జ్ చేసుకునే జీవితాల‌కు మ‌రో రీఛార్జ్ కొత్త సంవ‌త్స‌రంలో స‌రికొత్త‌గా రానుంది. ఇప్ప‌టికే మొబైల్‌..ఫోన్.. కేబుల్ టీవీ.. నెట్ ఇలా ఒక‌టి కాదు రెండు కాదు.. చాలా అంశాల‌కు సంబంధించి రీఛార్జ్ చేసుకోవ‌టం కామ‌న్ అయ్యింది. ఈ జాబితాలోకి కొత్త ఏడాది ఏప్రిల్ 1 నుంచి స‌రికొత్త రీఛార్జ్ ఒక‌టి ప్ర‌జ‌ల‌కు త‌ప్ప‌నిస‌రి కానుంది.

ఇప్ప‌టివ‌ర‌కూ ఇల్లు కానీ.. షాపు కానీ క‌రెంటు వాడేసుకోవ‌టం.. నెల త‌ర్వాత బిల్లు క‌ట్ట‌టం మ‌న‌కు అల‌వాటే. అయితే.. 2019లో మాత్రం ఈ సీన్ మార‌నుంది. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే.. 2019 ఏప్రిల్ 1 నుంచి మ‌నం వాడుకునే క‌రెంటుకు సంబంధించి ముంద‌స్తుగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకున్న త‌ర్వాత మాత్ర‌మే క‌రెంటును వాడుకునే వెసులుబాటు ఉండేలా స‌రికొత్త స్మార్ట్ ప్రీపెయిడ్ మీట‌ర్ల‌ను విద్యుత్ శాఖ ఏర్పాటు చేయ‌నుంది.

ఇప్పుడు ఎలా అయితే మొబైల్ రీఛార్జ్ చేసుకుంటున్నారో.. అదే రీతిలో క‌రెంటును సైతం రీఛార్జ్ చేసుకోవాల్సిందే. ఒక‌వేళ అంచ‌నాల‌కు మించిన క‌రెంటును వాడుకోవాల్సి ఉంటే.. ముందుగా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని రీఛార్జ్ చేసుకోవాలి. లేకుంటే.. ప‌ని మ‌ధ్య‌లో క‌రెంటు క‌ట్ కావ‌టం ఖాయం.

సో.. కొత్త సంవ‌త్స‌రంలో షురూ కానున్న ఈ స‌రికొత్త రీఛార్జ్ తో మ‌రెన్ని తిప్ప‌లకు తెర తీయ‌నున్నాయో చూడాలి. ఇంత‌కీ ఈ రీఛార్జ్ ఎందుకంటారా?. విద్యుత్ ను అక్ర‌మంగా దొంగ‌లించే దొంగ‌ల్ని ప‌ట్టుకోవ‌టం.. విద్యుత్ స‌ర‌ఫ‌రా చౌర్యానికి బ్రేకులు వేయ‌టానికిగా చెబుతున్నారు. ప్లాన్ బాగానే ఉంది కానీ.. దాన్ని అమ‌లు చేయ‌టంలో ఎన్ని తిప్ప‌లు ఎదుర‌వుతాయో చూడాలి.
Tags:    

Similar News