కోవింద్ జీ... మీ సింప్లిసిటీ గ్రేట్‌!

Update: 2017-10-09 11:02 GMT
హోరున వ‌ర్షం.. ఎడ‌తెరిపి లేకుండా కురుస్తోంది! కొంత‌మంది వ్య‌క్తులు వాన‌లో త‌డుస్తూ ఎవ‌రికోస‌మో వేచి చూస్తున్నారు. ఇంత‌లో ఒక విమానం వ‌చ్చింది. అందులోంచి ఒక వ్య‌క్తి హుందాగా న‌డుచుకుంటూ వ‌స్తున్నారు! వెంట‌నే అక్క‌డున్న కొంత‌మంది గొడుగుల‌తో ఆయ‌న చుట్టూ చేరి త‌డ‌వ‌కుండా ర‌క్ష‌ణ క‌ల్పించారు. ఆ మ‌ర్యాద‌ల‌ను ఆయ‌న వ‌ద్ద‌ని వారించి.. వాన‌లో త‌డుస్తూనే విమానాశ్ర‌య అధికారులు ఇచ్చిన గార్డ్ ఆఫ్ ఆన‌ర్‌ ను సగ‌ర్వంగా స్వీక‌రించారు! ఇది చూసిన అక్క‌డి వారంతా ఆయ‌న హుందాత‌నాన్ని చూసి ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేక‌పోయారు. త‌డుచుకుంటూనే గార్డ్ ఆఫ్ ఆన‌ర్‌ ను స్వీక‌రించింది మ‌రెవ‌రో కాదు.. దేశ ప్ర‌థ‌మ పౌరుడు - రాష్ట్ర‌ప‌తి రామ్‌ నాథ్ కోవింద్‌!!

దేశ ప్ర‌థ‌మ పౌరుడైనా ఏమాత్రం ఆడంబ‌రాల‌కు పోకుండా సాధార‌ణ వ్యక్తిలా ప్ర‌వ‌ర్తించి అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నారు రామ్‌ నాథ్ కోవింద్‌! తానెంతటి నిరాడంబరుడో నిరూపించి తన ప్రత్యేకతను, హుందాతనాన్ని చాటుకున్నారు. కోవింద్ తొలిసారి ఆదివారం కేరళలో పర్యటించారు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఆయన తిరువనంతపురం విమాశ్రయానికి చేరుకున్నారు. కేరళ గవర్నర్ పి.సదాశివన్ - ముఖ్యమంత్రి పినరయి విజయన్ తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఆ సమయంలో వర్షం బాగా పడుతోంది.

భద్రతాధికారులు ఆయనకు గొడుగు పట్టేందుకు ప్రయత్నించగా కోవింద్ సున్నితంగా తిరస్కరించారు. వర్షంలో తడుస్తూనే తనకు సమర్పించిన గార్డ్ ఆఫ్ ఆనర్‌ ను స్వీక‌రించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అనంతరం మాతా అమృతానందమయి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ చారిటీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు హెలికాప్టర్‌ లో కొల్లాం వెళ్లారు. అయితే రాష్ట్రపతి వర్షంలో తడుస్తూనే గౌరవ వందనాన్ని స్వీకరించడం చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. ఆయన హుందాతనాన్ని ప్ర‌శంసించారు. ఎంతో నిరాడంబ‌రంగా ఉంటూ రాష్ట్రప‌తి ప‌ద‌వికి వ‌న్నె తెచ్చిన వారు ఉన్నారు. వారికి ఏమాత్రం తీసిపోకుండా కోవింద్ ప్ర‌వ‌ర్తిస్తున్నార‌డంలో సందేహం లేదు!!
Tags:    

Similar News