రాష్ట్రప‌తి రేసులోకి వెంక‌య్య‌...లాజిక్ అదే

Update: 2017-05-06 07:07 GMT
రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్‌ ముఖ‌ర్జీ ప‌ద‌వీ కాలం ముగుస్తున్న నేప‌థ్యంలో రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి అభ్య‌ర్థిని నిలబెట్టేందుకు ఓవైపు విప‌క్షాలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎవరనే అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. అనేక పేర్లు ఈ సందర్భంగా చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం.

ద్రౌపది ముర్ము:

ఒడిశాకు చెందిన ఈ 58 సంవత్సరాల మహిళా రాజకీయవేత్త ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్‌ గా ఉన్నారు. 2000-04 మధ్యకాలంలో ఒడిశా బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఈమెకు మూడు అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఒకటి మహిళ కావడం. అత్యున్నత పదవికి ఆమెను ఎంపిక చేయడం ద్వారా మహిళల్లో మద్దతు పెంచుకునేందుకు అవకాశముంటుంది. గిరిజన తెగకు చెందిన వ్యక్తి కాబట్టి ఆ రకంగానూ మద్దతు కూడగట్టవచ్చు. రాష్ర్టానికి చెందిన అభ్యర్థి కాబట్టి ఒడిశా పాలకపక్షమైన బీజేడీ కూడా ఆమెను బలపర్చాల్సి రావచ్చు.

సుమిత్రా మహాజన్:

74 సంవత్సరాల సుమిత్రా మహాజన్ 2014లో లోక్‌సభ స్పీకర్ అయ్యారు. ఎనిమిదిసార్లు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని ఇండోర్‌నుంచి లోక్‌ సభకు ఎనికయ్యారు. అటల్‌ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ప్రధాని నరేంద్రమోడీ విశ్వాసం చూరగొన్న వ్యక్తి. అయితే విపక్షాలు ఆమె తటస్థతను అనేకసార్లు ప్రశ్నించాయి.

సుష్మాస్వరాజ్ :

65 సంవత్సరాల సుష్మ విదేశాంగశాఖను చేపట్టిన రెండో మహిళ. ఏడుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మూడుసార్లు అసెంబ్లీకి ఎనికయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కూడా చేశారు. 1977లో అతిపిన్నవయస్సులో తన 25వ ఏట హర్యానా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అన్ని పార్టీల్లో ఆమెకు మిత్రులున్నారు. విస్తృతస్థాయి ఏకాభిప్రాయ సాధనకు సుష్మా అభ్య‌ర్థిత్వం బీజేపీకి ఉపకరించవచ్చు.

ఎం వెంకయ్యనాయుడు:

ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఈ 67 సంవత్సరాల బీజేపీ నాయకుడు ప్రస్తుతం కేంద్రంలో ప‌ట్ట‌ణాభివృద్ధి, సమాచార-ప్రసారశాఖ నిర్వహిస్తున్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు. న‌రేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని సమర్థించిన మొదటి నాయకుల్లో ఒకరు. దక్షిణాదిలో విస్తరించాలని ఉరకలేస్తున్న కాషాయపార్టీకి వెంకయ్య అభ్యర్థిత్వం అనుకూలంగా పనిచేయవచ్చున‌ని అందుకే ఈయ‌న అభ్య‌ర్థిత్వాన్ని ప‌రిశీలించ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.

థావర్‌ చంద్ గెహ్లాట్:

మధ్యప్రదేశ్‌ కు చెందిన 68 సంవత్సరాల గెహ్లాట్ ప్రస్తుతం మోడీ సర్కారులో సామాజికన్యాయ మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ అత్యున్నత విధాన నిర్ణాయక సంస్థ అయిన పార్లమెంటరీ బోర్డులో ఉన్న ఏకైక దళిత నేత. ఆరెస్సెస్ నేపథ్యమున్న గెహ్లాట్ వివాద రహితుడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News