టీకా ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ప్ర‌ధాని మోడీ స్ప‌ష్టం

Update: 2021-06-07 12:30 GMT
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి దాదాపు 30 నిముషాలు ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా క‌రోనా టీకా విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంపై వ‌స్తున్న విమ‌ర్శ‌లను చెరిపేసుకునేందుకు, టీకా విష‌యంలో తాము అనుస‌రించ‌నున్న వ్యూహాన్ని చెప్పేందుకు ఎక్కువ‌గా ప్ర‌య‌త్నించారు. ఏడు కంపెనీల వ్యాక్సిన్లు ... త‌యారు చేస్తున్నాయ‌న్న మోడీ.. క‌రోనాపై అన్ని రూపాల్లోనూ పోరాడుతున్నామ‌ని, క‌నిపించ‌ని శ‌త్రువుతో పోరాటం చేస్తున్నామ‌ని ఎప్ప‌టి లాగానే ప్ర‌క‌టించారు.

అయితే.. ఏప్రిల్‌లో ఆక్సిజ‌న్ కొర‌త ఏర్ప‌డింద‌ని.. దీనిని స‌రిచేసే ప్ర‌య‌త్నం చేశామ‌ని.. ప్ర‌ధాని వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఇక‌, గ‌తంతో పొలిస్తే.. ఇప్పుడు వ్యాక్సినేష‌న్ పెరిగింద‌న్నారు. భార‌త్ స్వ‌యంగా రెండు ర‌కాల టీకాల‌ను ఉత్పత్తి చేసింద‌ని.. వీటిని ప్ర‌పంచ దేశాల‌కు కూడా పంపించి భార‌త ఆత్మ‌నిర్భ‌ర‌త‌ను ప్ర‌క‌టించామ‌ని పేర్కొన్న ప్ర‌ధాని.. క‌రోనా రెండో ద‌శ‌లో.. భార‌త్‌కు ప్రపంచ దేశాల మ‌ద్ద‌తు బాగానే ద‌క్కింద‌న్నారు. కాగా, ఇప్ప‌టి వ‌ర‌కు 23 కోట్ల మందికి టీకా.. ఇచ్చిన‌ట్టు ప్ర‌ధాని తెలిపారు.

ఇక‌, ఇప్పుడున్న ప‌రిస్థితిని ఎదుర్కొనేందుకు దేశ విదేశాల నుంచి టీకాలు తెప్పిస్తున్నామ‌ని ప్ర‌ధాని తెలిపారు. పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రికీ టీకా ఉచితంగా ఇచ్చేందుకు ప్ర‌భుత్వం సంక‌ల్పించింద‌న్న ప్ర‌ధాని.. ఇప్ప‌టి వ‌ర‌కు 23% టీకాల పంపిణీని విజ‌య‌వంతంగా పూర్తి చేశామ‌న్నారు. అదేస‌మ‌యంలో న‌వంబ‌రు నాటికి 80 శాతం టీకాలు పంపిణీ పూర్తిచేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నట్టు వివ‌రించారు.

ఈ నెల 21 నుంచి 18 ఏళ్లు పైబ‌డిన ప్ర‌తి ఒక్క‌రికీ ఉచితంగా టీకా పంపిణీ చేయ‌నున్న‌ట్టు మోడీ స్ప‌ష్టం చేశారు. ఇక‌, పిల్ల‌ల కోసం.. ప్ర‌త్యేకంగా రెండు ర‌కాల ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్న‌ట్టు ప్ర‌ధాని వెల్ల‌డించారు. రెండో ద‌శ‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని ప్ర‌ధాని తెలిపారు. ఈ ఏడాది దీపావ‌ళి వ‌ర‌కు పేద‌ల‌కు ప్ర‌ధాన మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ యోజ‌న‌ను అమలు చేస్తున్న‌ట్టు మోడీ వివ‌రించారు. ఇక‌, యువ‌త కూడా వ్యాక్సిన్ తీసుకుని క‌రోనాపై పోరులో ముందుండాల‌ని, అయితే నిర్లక్ష్యం వ‌ద్ద‌ని సూచించారు. క‌రోనాపై విజ‌యం సాధిస్తామ‌నే విశ్వాసం ఉంద‌న్నారు.
Tags:    

Similar News