బ్రిటన్ ప్రధాని సంచలనం

Update: 2022-04-11 02:30 GMT
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ చర్యలు సంచలనంగా మారాయి. ఎలాంటి ముందస్తు సమాచారం కానీ సంకేతాలు కానీ లేకుండా హఠాత్తుగా ఉక్రెయిన్లో ప్రత్యక్షమయ్యారు. ఉక్రెయిన్-రష్యా మధ్య గడచిన 40 రోజులుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. యుద్ధంలో దాదాపు నాశనమైపోయిన ఉక్రెయిన్ లోకి బోరిస్ అడుగుపెట్టడం సంచలనంగా మారింది. యుద్ధం జరుగుతున్న దేశంలోకి మామూలుగా అయితే ఇతర దేశాల అధినేతలు అడుగుపెట్టరు.

కానీ సంప్రదాయానికి భిన్నంగా బోరిస్ ఉక్రెయిన్లోకి అడుగుపెట్టి దాదాపు శిధిలమైపోయిన రాజధాని కీవ్ నగరంలో విస్తృతంగా  పర్యటించారు.  ఒకవైపు రష్యా సైన్యం ప్రయోగిస్తున్న బాంబులు, క్షిపణలు మరోవైపు బోరిస్ కీవ్ సందర్శనతో ఎప్పుడేమి జరుగుతుందో అర్ధంకాక ప్రపంచదేశాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అయితే రష్యా క్షిపణులు, బాంబులను బోరిస్ ఏమాత్రం పట్టించుకోకుండా తన సెక్యురిటితో హ్యాపీగా తిరిగేశారు.

ఐరోపా పర్యటన పెట్టుకున్న బోరిస్ పనిలోపనిగా హఠాత్తుగా ఉక్రెయిన్లోకి అడుగుపెట్టారు. బోరిస్ అడుగుపెట్టిన విషయాన్ని ఉక్రెయిన్ జనాలతో పాటు ముందు పాశ్చాత్య మీడియా కూడా నమ్మలేదు. కానీ కీవ్ రోడ్లపై తిరుగుతున్న బోరిస్ ను చూసిన తర్వాత అంతా ఆశ్చర్యపోయారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి సంఘీభావం తెలిపేందుకే తాను కీవ్ లో ఆకస్మిక పర్యనకు వచ్చినట్లు బోరిస్ చెప్పారు.

బ్రిటన్ తరపున ఉక్రెయిన్ కు అవసరమైన సైనిక, ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు చాలా దేశాలు, నాటో దేశాలు ఉక్రెయిన్ కు ఆర్ధికంగా, ఆయుధాల పరంగా సాయం అందించిన విషయం తెలిసిందే. అయితే ఆయా దేశాలన్నీ సాయం చేస్తు మద్దతు తెలుపుతున్నాయి. కానీ బోరిస్ మాత్రం ప్రత్యక్షంగా ఉక్రెయిన్లోకి అడుగుపెట్టి మద్దతు ప్రకటించడం సంచలనంగా మారింది.

బ్రిటన్ తరపున ఉక్రెయిన్ కు కొత్త ప్యాకేజీ ప్రకటించటానికే బోరిస్ వచ్చినట్లు పాశ్చాత్య మీడియా అంచనా వేస్తోంది. కీవ్ రోడ్లలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో కలిసి బోరిస్ పర్యటించిన ఫోటోలు, వీడియోలు ఇపుడు మీడియా, సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.
Tags:    

Similar News