మాజీ ఎస్ ఈసీ నిమ్మ‌గ‌డ్డ‌పై చ‌ర్య‌లేంటి? రాజ‌కీయ వ‌ర్గాల్లో గుస‌గుస‌

Update: 2021-09-22 14:30 GMT
టీడీపీ ఎమ్మెల్యేలు.. నిమ్మ‌ల రామానాయుడు, కింజ‌రాపు అచ్చెన్నాయుడుల‌పై అసెంబ్లీ ప్రివిలేజ్ క‌మి టీ.. చ‌ర్య‌లకు సిఫార‌సు చేసింది. వారిని త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న వ‌ర్షాకాల స‌మావేశాల్లో స‌భ‌లో మాట్లాడ‌కుం డా చేయాల‌ని పేర్కొంది. అయితే, దీనిపై అంతిమ నిర్ణ‌యం.. స్పీక‌ర్ తీసుకోనున్నారు. ఒక‌వేళ స్పీక‌ర్ కూడా దీనికి ఓకే చెబితే.. న్యాయ‌పోరాటానికి అవ‌కాశం ఉంటుందా? ఉండ‌దా? అనేది ఆస‌క్తిగా మారింది. గ‌తంలో స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేసిన‌ప్పుడు.. క‌ర్ణాట‌క విష‌యంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. స‌రే! ఇప్పుడు ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.. మ‌రో విష‌యం ఆస‌క్తిగా మారింది.

రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేసిన నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌.. మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి.. కొడాలి నాని .. వంటివారి దూకుడుకు బ్రేకులు వేశారు. అదేస‌మ‌యంలో ఎమ్మెల్యే జోగి ర‌మేష్‌కు కూడా ఆయ‌న ముకుతాడు వేశారు. మునిసిప‌ల్ ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో వారు వివాదాస్ప‌దంగా మాట్లాడ‌డాన్ని ఆయ‌న సీరియ‌స్‌గా తీసుకున్నారు. అయితే.. వారు కోర్టును ఆశ్ర‌యించి.. కొంత మేర‌కు ఉప‌శ‌మ‌నం పొందారు. అయితే.. త‌మ హ‌క్కుల‌కు భంగం క‌లిగించారంటూ.. ప్రివిలేజ్ క‌మిటీకి ఫిర్యాదు చేశారు. ఫ‌లితంగా నిమ్మ‌గ‌డ్డ‌పై ప్రివిలేజ్ క‌మిటీ విచార‌ణ చేప‌ట్టింది.

విచార‌ణ‌లో ఉన్నందునే..

ఇప్ప‌టికే నిమ్మ‌గ‌డ్డ‌కు ప్రివిలేజ్ క‌మిటీ ఇచ్చిన నోటీసుల‌పై ఆయ‌న స‌మాధానం చెప్పారు. తనకు శాసనసభ్యుల పైన..సభ పైన గౌరవం ఉందన్నారు. మరింత సమాచారం ఇస్తే వాటి పైన వివరణ ఇస్తానన్నారు. దీంతో.. ప్రివిలేజ్ కమిటీ మరింత సమాచారంతో ఆయనకు లేఖ పంపింది. అయితే, మంత్రుల‌పై తాను తీసుకున్న చ‌ర్య‌ల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం కోర్టులో విచార‌ణ‌లో ఉంద‌ని అందుకే వివ‌ర‌ణ ఇవ్వ‌లేక‌పోతున్నాన‌ని నిమ్మ‌గ‌డ్డ తెలిపారు. దీంతో ప్రివిలేజ్ క‌మిటీ..అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.

చ‌ర్య‌లు త‌ప్ప‌వా?

న్యాయవ్యవస్థలో విచారణ ఉందనే కారణంగా.. ప్రివిలేజ్ కమిటీ విచారణ ఆపాల్సిన అవసరం లేదని కమిటీ ఛైర్మన్ కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి స్పష్టం చేశారు. నిమ్మగడ్డ అవగాహన లోపం.. అనుభవరాహిత్యంతోనే ఆ రకంగా చెప్పి ఉండవచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు. నిమ్మగడ్డ నుంచి పూర్తిగా సమాధానం వచ్చిన తరువాత ఆ విషయాన్ని ఇక వదిలేయాలా..లేక చర్యలు తీసుకోవాలా అనే అంశం పైన నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు. అయితే, తాను ఎక్కడా సభ్యులను గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించ లేదని నిమ్మగడ్డ చెబుతున్నారు. దీంతో ఈ విష‌యంలో ప్రివిలేజ్ క‌మిటీ ఎలా వ్య‌వ‌హ‌రిస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది.

గ‌తంలో ఏం జ‌రిగింది?

అధికారంలో ఉన్న ఎన్నికల కమిషనర్ పై మహారాష్ట్ర అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ విచారణ జరిపి స్పీకర్ కు నివేదిక ఇచ్చింది. దీంతో క‌మిష‌న‌ర్ ఒక‌రోజు స‌భ‌కు వ‌చ్చి.. నిల‌బ‌డాలంటూ.. మ‌హారాష్ట్ర స్పీక‌ర్ ఆదేశించారు. అయితే.. దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో.. సాయంత్రం ఆరుగంట‌ల‌కు ఉత్త‌ర్వులు ఇచ్చి.. ఉద‌యం ముగిసిన‌ట్టుపేర్కొన్నారు. అయినా.. ఇది ఇప్ప‌టికీ.. సుప్రీం కోర్టులో విచార‌ణ‌లో ఉంది. అయితే.. అప్ప‌టికి ఆయ‌న ఎస్ ఈసీగా ఉన్నారు. మ‌రి ఇప్పుడు నిమ్మ‌గ‌డ్డ విష‌యంలో ఏం చేస్తారు? మ‌హాలో జ‌రిగిన‌ట్టు.. ఇక్క‌డ కూడా స‌భ జ‌రిగిన‌న్ని రోజులు.. స‌భ‌కు వ‌చ్చి హాజ‌రై నిల‌బ‌డాల‌ని ఆదేశిస్తారా? లేక స‌భ‌కు వ‌చ్చి వివ‌ర‌ణ ఇవ్వ‌మంటారా? సారీ చెప్ప‌మంటారా? చూడాలి.

ఏం జ‌రుగుతుంది.

నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ ఇప్ప‌టి వ‌ర‌కు పూర్తి స‌మాధానం ఇవ్వ‌లేదు. సో.. రేపు స‌మాధానం ఇచ్చినా.. ఫిర్యాదు చేసిన మంత్రుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తరువాత ప్రివిలేజ్ కమిటీ సమావేశమై తమ నిర్ణయాన్ని ఫైనల్ చేయనుంది. దీనిని అసెంబ్లీ స్పీకర్ కు నివేదించనుంది. ఆ సిఫార్సుల ఆధారంగా స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.




Tags:    

Similar News