బెంగ‌ళూరులో కొత్త పోరాటం మొద‌లైంది

Update: 2017-02-10 13:32 GMT
ఇండియ‌న్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో కొత్త పోరాటం మొద‌లైంది. ప‌చ్చ‌ద‌నానికి ప్రాధాన్యం ఇచ్చే బెంగ‌ళూరు వాసులు మెరుగైన ర‌వాణా స‌దుపాయం కోసమంటూ నిర్మిస్తున్న స్టీల్ ఫ్లై ఓవ‌ర్ ను అడ్డుకునేందుకు అంతా ఒక్క‌ట‌య్యారు. బెంగ‌ళూరు నగరం న‌డిబొడ్డు నుంచి విమానాశ్రయానికి వెళ్లాలంటే దాదాపు రెండు గంటల సమయం పడుతోంది. ఈ స‌మ‌యాన్ని కాస్త త‌గ్గించేందుకు 6.7 కిలోమీటర్ల ప్లై ఓవర్‌ ను నిర్మించేందుకు బహత్‌ బెంగళూరు మహానగర పాలిక సిద్ధ‌మైంది. అయితే పది, పదిహేను నిమిషాలు ప్రయాణ సమయం కలిసి వ‌చ్చే దానికోసం అపార వృక్ష సంపదను కోల్పోవడం అర్థరహితమని పర్యావరణవేత్తలు వాదిస్తున్నారు. ఏకంగా వేలాది మంది ప్రజల సంతకాలను సేకరించి నగర మున్సిపల్‌ కార్పొరేషన్ కు పంపించారు.

1,791 కోట్ల రూపాయలు ఖర్చు తో  55వేల టన్నుల స్టీలు ఉప‌యోగించి  6.7 కిలోమీటర్ల స్టీల్‌ ఫ్లైఓవర్‌ ను నిర్మించాలని నగర మున్సిపాలిటీ నిర్ణయించింది. ఈ నిర్మాణంతో  45 జాతులకు చెందిన స‌మారు 1668 చెట్లను కొట్టివేయాల్సి వస్తుందని మున్సిపాలిటీ అంచ‌నా వేసింది. అయితే దీనిపై ప‌లువురు ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అజీం ప్రేమ్‌ జీ యూనివ‌ర్సిటీ రంగంలోకి దిగి 71 జాతులకు చెందిన 2 - 244 చెట్లను కొట్టివేయాల్సి వస్తుందని తేల్చింది. ప‌నులు మొద‌లుపెట్టి జయ మహల్‌ లోని 112 చెట్లను కొట్టివేయాలని మున్సిపాలిటీ నిర్ణయించిన నేపథ్యంలో ప‌లువురు జాతీయ గ్రీన్ ట్రిబ్యున‌ల్ లో కేసు కూడా వేశారు. ప్ర‌స్తుతం ఈ విచార‌ణ కొన‌సాగుతోంది. అదే స‌మ‌యంలో బెంగ‌ళూరు వాసులు త‌మ గ‌ళాన్ని వినిపిస్తూ పిటిష‌న్ల ప‌ర్వం కొన‌సాగిస్తున్నారు. కాగా, స్వ‌చ్ఛ‌మైన గాలిని, చ‌క్క‌టి ప‌చ్చ‌ధ‌నాన్ని అందించే పచ్చని చెట్ల వాతావరణం మ‌నుషుల‌ను ఉత్సాహంగా ఉంచుతుంద‌ని,  అంతేకాకుండా రోగులు త్వరగా కోలుకుంటారని ఓ అధ్యయనంలో తేలింది. చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో హింసాత్మక ధోరణి బాగా తక్కువగా ఉంటుందని కాలిఫోర్నియాలో జరిపిన మరో విశ్లేష‌ణ వివ‌రించింది. ఆకుప‌చ్చ‌ని చెట్లున్న ప్రాంతంలో చదువుకునే పిల్లలకు ఎక్కువ తెలివితేటలు ఉండడమే కాకుండా వారిలో జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ ఉంటుందని ప‌లు స‌ర్వేలు వివ‌రించాయి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News