పెట్రో సెగ..భారత్ బంద్ లో వినూత్న నిరసనలు

Update: 2018-09-10 10:37 GMT
పెట్రో ధరలకు నిరసనగా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు చేపట్టిన భారత్ బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఈ బంద్ కు సుమారు 21 పార్టీలు మద్దతు తెలిపాయి. ఆదివారం కూడా పెట్రో ధరలు పెరగడంతో మరింత ఉధృతంగా  కాంగ్రెస్ , ఇతర పక్షాలు నిరసనలు కొనసాగిస్తూ ఎండగడుతున్నాయి.  అయితే బీహార్ లో మాత్రం ఓ వినూత్న నిరసన అందరినీ ఆకట్టుకుంది. బీహార్ సీనియర్ నేత శరద్ యాదవ్ కొత్తగా ఏర్పాటు చేసిన లోక్ తాంత్రిక్ జనతాదల్ (ఎల్.జే.డీ) కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపి అందరి దృష్టిని ఆకర్షించారు. పెట్రో ధరలు మండుతున్న దృష్ట్యా.. ఓ బైక్ ను నడపడం కన్నా.. దాన్ని మోసుకుపోవడమే మేలు అంటూ భుజాలపై బైక్ ఎత్తుకొని ఎల్.జే.డీ కార్యకర్తలు నిరసన తెలిపారు. పెరిగిన ధరలు సామాన్యులకు భారమని తెలియజేసేందుకే ఇలా చేశామని వివరణ ఇచ్చారు.  దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు కూడా ఎండ్లబండిపై బైకులను ఎక్కించి వినూత్న నిరసన తెలిపారు.

ఆదివారం సైతం లీటర్ పెట్రోల్ పై 12 పైసలు - డీజిల్ పై 10 పైసలు ధరలు పెరగడం గమనార్హం.  ఈ  ధరా భారంతో సామాన్యులు రోడ్డు ఎక్కుతున్నా ఆయిల్ కంపెనీలు పెంచుకుంటూ పోవడంపై నిరసన వ్యక్తమవుతోంది.  దేశంలోకెల్ల ముంబైలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర 90 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్ లో 85.35 రూపాయలుంది. ప్రతిపక్షాలు భారత్ బంద్ కు దిగినా బీజేపీ సర్కారు పెట్రో ధరలు తగ్గించకపోవడంపై దుమారం రేగుతోంది.
Tags:    

Similar News