పబ్లిక్ పల్స్ సర్వే: దుబ్బాకలో బీజేపీదే గెలుపా?

Update: 2020-11-03 19:00 GMT
తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నిక అగ్గిరాజేసింది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. కొదమ సింహాల్లో తలపడ్డ ఇద్దరూ హోరా హోరీ ప్రచారంతో హోరెత్తించారు. ఎత్తులు, పైఎత్తులు వేశారు. తెలంగాణలో అధికారంలో ఉండడంతో టీఆర్ఎస్ తన ప్రత్యర్థి బీజేపీని ఆర్థికంగా కొంత దెబ్బతీసింది. అయితే దుబ్బాకలో మోహరించిన బీజేపీ శ్రేణులు మాత్రం బాగానే కష్టపడ్డారు. మొత్తం బీజేపీ శ్రేణులను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దుబ్బాకలో మోహరించారు. తను అధ్యక్షుడు అయ్యాక జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్వశక్తులు ఒడ్డారు.

ఇక అధికార టీఆర్ఎస్ కు ట్రబుల్ షూటర్ హరీష్ రావు అతనొక్కడే అందరిలోనూ అన్నట్టుగా వ్యవహరించారు. హరీష్ కాలు పెడితే అక్కడ విజయం సుసాధ్యం అన్న అంచనాలతో కేసీఆర్, కేటీఆర్ కూడా అటు వైపు తొంగిచూడలేదు. ప్రెస్ మీట్లు, సభలకే పరిమితం అయ్యారు. హరీష్ రావు కూడా సుడిగాలిలా పర్యటించి తన ఎత్తులు, జిత్తులతో టీఆర్ఎస్ గెలుపు కోసం కష్టపడ్డారు.

అంతా అనుకున్నట్టుగా దుబ్బాక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 82శాతం పోలింగ్ నమోదైంది. దీన్ని బట్టి జనాలు ఓట్లు వేయడానికి పోటెత్తారనే అర్థమవుతోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రజలు నిబంధనలు పాటిస్తూ ఇంత భారీగా పోలింగ్ చేయడంతో పార్టీలో ఒకింత ఆనందం.. మరోపక్క తమ కొంప ముంచుతుందా అన్న భయం నెలకొంది.

పోలింగ్ మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. కొన్ని అధికార టీఆర్ఎస్ గెలుస్తుందని ఫలితాలు ప్రకటించగా.. మరికొన్ని ప్రతిపక్ష బీజేపీ గెలుస్తుందని తెలిపాయి.

ఈ క్రమంలోనే దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో ‘పబ్లిక్ పల్స్ సర్వే ఏజెన్సీ’ తమ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఇది వరకు చాలా ఎన్నికల ఫలితాలను ఖచ్చితత్వంతో వెల్లడించిన పబ్లిక్ పల్స్ సంస్థ తాజాగా దుబ్బాకలోనూ ఓట్లేసిన ప్రజల అభిప్రాయాలను క్రోడీకరించి సర్వే ఫలితాలను వెల్లడించింది.

దుబ్బాక లో బీజేపీ గెలుస్తుందని ‘పబ్లిక్ పల్స్ సర్వే ఏజెన్సీ’ స్పష్టం చేసింది. బీజేపీకి దుబ్బాకలో 45.2శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇక అధికార టీఆర్ఎస్ కు 42.5శాతం ఓట్లు మాత్రమే వస్తాయని వివరించింది. ముచ్చటగా మూడో స్తానంలో కాంగ్రెస్ పార్టీ 11.7శాతం ఓట్లు సాధించి వెనుకబడుతుందని తెలిపింది. ఇక ఇతరులకు 0.6శాతం ఓట్లు వస్తాయని వివరించింది. టీఆర్ఎస్ పై బీజేపీ 4000-6000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని పబ్లిక్ పల్స్ ప్రజల నాడిని పసిగట్టి చెప్పుకొచ్చింది.

మండలాల వారీగా పబ్లిక్ పల్స్ మెజార్టీ ఓట్లు ఎవరికి వస్తాయన్నది ఖచ్చితత్వంతో సర్వే చేసింది. దుబ్బాక, చేగుంట, నర్సంగి,  మిడిదొడ్డి మండలాల్లో బీజేపీ మెజారిటీ సాధిస్తుందని తెలిపింది. ఇక ఒకే ఒక తొగుట మండలంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధిస్తుందని తెలిపింది.రాయపోలు, దౌల్తాబాద్ మండలాల్లో టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు వస్తాయని వివరించింది.

మరి ‘పబ్లిక్ పల్స్ సర్వే ఏజెన్సీ’ ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా? బీజేపీ గెలుస్తుందా ? లేదా అధికార పార్టీ ఆశిస్తున్నట్టు టీఆర్ఎస్ గెలుస్తుందా అనేది నవంబర్ 10న ఎన్నికల కౌంటింగ్ లో తేలనుంది. అప్పటివరకు అందరూ ఉత్కంఠగా ఎదురుచూడాల్సిందే.. లెట్ వెయిట్ అండ్ సీ..

Tags:    

Similar News