యంగ్ డాక్టర్ చేతిలోకి పులివెందుల వైసీపీ ?

Update: 2023-04-16 20:50 GMT
పులివెందుల అంటే వైఎస్సార్ ఫ్యామిలీ. రాజకీయంగా నాలుగున్నర దశాబ్దాలుగా తిరుగులేని కుటుంబం వారిది. వైఎస్సార్, వైఎస్ వివేకా, వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్  ఇలా వీరంతా ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. ఇక పులివెందుల వైసీపీ బాధ్యతలను ఇప్పటిదాకా వైఎస్ భాస్కర్ రెడ్డి చూస్తూ వచ్చారు.

ఆయనను వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేసింది. దాంతో పులివెందుల వైసీపీకి ఇపుడు సారధి ఎవరు అన్న చర్చ వస్తోంది. గత కొన్నేళ్ళుగా పులివెందులను భాస్కరరెడ్డి నడిపిస్తున్నారు. ఆయన అరెస్ట్ వ్యవహారం తో ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

అయితే కచ్చితంగా ఏడాది వ్యవధిలో ఎన్నికలు ఉన్నాయి. దాంతో పులివెందులలో వైసీపీకి ఇంచార్జిగా ఒక సమర్ధుడైన నాయకుడు కావాలి.అందుకే వైఎస్ జగన్ కొత్త నాయకత్వాన్ని రెడీ చేస్తున్నారు అని అంటున్నారు. వైఎస్ భాస్కరరెడ్డి అన్న అయిన వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు అయిన డాక్టర్ అభిషేక్ రెడ్డికి పగ్గాలు ఇస్తారని అంటున్నారు.

ఇక వైఎస్ ప్రకాష్ రెడ్డి పారిశ్రామికవేత్తగా ఉన్నారు. ఆయన సౌమ్యుడిగా పేరుంది. వివాదరహితుడు అని కూడా  చెబుతారు. ఆయన కుమారుడు వైఎస్ మదన్ మోహన్ రెడ్డి తొండూరు వైసీపీ బాధ్యతలను చూస్తున్నారు. ఇక ఆయన కుమారుడే ఈ అభిషేక్ రెడ్డి. ఈయన గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి అత్యంత కీలకంగా వ్యవహరించి ప్రచారం చేశారు.

అంతే కాదు ఆయన పులివెందుల జమ్మలమడుగులలో పార్టీని విజయ తీరాలకు చేర్చడంతో తన వంతుగా క్రుషి చేశారని అంటున్నారు. ప్రస్తుతం వైసీపీ డాక్టర్స్ విభాగంలో ఆయన రాష్ర స్థాయి పదవిలో ఉన్నారు. ఆయన విశాఖలో ఉంటున్నారు. ఆయన సతీమణి  కూడా గైనకాలజిస్టుగా ఉంటున్నారు.

ప్రజలను ఎక్కువగా కలుసుకోవడం, వారు చెప్పినది సావధానంగా వినడం, సమస్యలను పరిష్కరించే నేర్పు ఓర్పు ఈ యువ డాక్టర్ లో పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు అందువల్ల ఆయనకే పులివెందుల వైసీపీ బాధ్యతలను సాధ్యమైనంత తొందరలో అప్పగిస్తారని అంటున్నారు. ఎన్నికల సీజన్ కాబట్టి తొందరపడకపోతే పార్టీకి నష్టం వాటిల్లుతుందని కూడా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే పులివెందులకు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ షిప్ రాబోతోంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే పులివెందులలో వైసీపీ పని అయిపోయిందని టీడీపీ ఇంచార్జి బీటెక్ రవి అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో వైసీపీ జెండా ఎగరేస్తామని ఆయన గట్టిగా చెబుతున్నారు. దీంతో ఇపుడు వైసీపీ యంగ్ డాక్టర్ కే బాధ్యతలు అప్పగించాలనుకోవడం మాత్రం హాట్ డిస్కషన్ గానే ఉంది అంటున్నారు.

Similar News