వీర విధేయుడి నోట వచ్చిన మాటతో జగన్ కు భారీ డ్యామేజ్!

Update: 2022-05-26 13:30 GMT
విధేయత పెరుగుతోంది. గతంలో రాజకీయ పార్టీల మీద అభిమానం ఒక స్థాయిలో ఉండేది. అలా అని అప్పట్లో కరడు కట్టిన బ్యాచ్ ఉండేది కాదని కాదు. కానీ.. వారి ఉనికి పెద్దగా బయటకు వచ్చేది కాదు. మహా అయితే ఆ వీధి.. లేదంటే ఆ ఊరి వరకు పరిమితమయ్యేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందుబాటులోకి వచ్చిన సాంకేతికత పుణ్యమా అని.. తమకున్న అభిమానాన్ని ప్రదర్శించేందుకు బోలెడన్ని వేదికలు అందుబాటులోకి వచ్చేశాయి. ఒక మంచితో పాటు చెడు వెంట వచ్చిన చందంగా.. తమకు నచ్చిన వారిని ఆకాశానికి ఎత్తేసే దానికి బదులు.. తమ వైరి వర్గం వారిపై విరుచుకుపడే ధోరణి అంతకంతకూ ఎక్కువైంది. గతంలో తమ అధినేత.. తమ పార్టీ సాధించిన విజయాల్ని చెప్పుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.

ఇప్పుడు అందుకు భిన్నంగా తమ వైరి వర్గం వారు తమ పార్టీ మీదా.. తమ అధినేత మీద చేసే విమర్శలకు సమాధానాలు ఇచ్చేందుకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. విమర్శల స్థాయి దాటిపోయి వ్యక్తిగత విమర్శలు.. సభ్య సమాజంలో అనని మాటల్ని సైతం అనేస్తూ కొత్త తరహా అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి వారిని కంట్రోల్ చేసే కన్నా.. ప్రోత్సహిస్తున్న తీరు ఇప్పుడు షాకింగ్ గా మారింది. వైసీపీకి సంబంధించినంత వరకు ఆ పార్టీ అధినేత జగన్ ను విపరీతంగా అభిమానించి.. ప్రేమించే వారిలో పంచ్ ప్రభాకర్ ఒకరు. అమెరికాలో ఉంటూ.. ఉద్యోగమో.. వ్యాపారమో చేసుకుంటూ ఉండే ఆయన నోరు తెరిస్తే ఎంత గబ్బు మాటలు వస్తాయో తెలిసిందే. ఊర్లో వారు సైతం నలుగురు ముందు అనేందుకు సిగ్గుపడే చాలా మాటల్నిఆయన నిర్లజ్జగా వాడేస్తుంటారు.

రాజకీయం అన్న తర్వాత అందరూ ఒకేలా ఉంటారనుకోవటం అత్యాశే అవుతుంది. కాకుంటే..తమకున్న అభ్యంతరాల్ని ఎత్తి చూపే విషయంలో సభ్యత.. సంస్కారాలకు తావిచ్చేలా ఉండటం చాలా అవసరం. అందుకు భిన్నంగా నోటికి వచ్చిన మాటల్ని అనే తీరు మంచిది కాదు. ఇలా తిట్టే విషయంలో ఇవాళ పంచ్ ప్రభాకర్ కావొచ్చు.. రేపొద్దున మరింత మురికిగా మాట్లాడేవారు వేదికల మీదకు రావొచ్చు. అలా అంతకంతకూ దిగజారిపోయేలా మాట్లాడటం వల్ల లేని ఇబ్బందులు ఎదురవుతాయే తప్పించి ఇంకేం ఉండదు.

అమెరికా నుంచి దావోస్ వెళ్లిన పంచ్ ప్రభాకర్.. ఏపీ ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యాయస్థానాల్ని..న్యాయమూర్తుల్ని అనరాని మాటలు అన్న పంచ్ ప్రభాకర్ మీద ఇప్పటికే కేసులు నమోదు కావటం.. ఆయన్ను అదుపులోకి తీసుకోవాలంటూ కోర్టులు ఆదేశించినా.. ఇప్పటికి అమలు కాని పరిస్థితి. దావోస్ వెళ్లిన ఆయన ఒక యూట్యూబ్ చానల్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా దావోస్ లో సీఎం జగన్ కష్టాన్ని ఆయన చెప్పే క్రమంలో ఆయన నోటి నుంచి వచ్చిన మాట జగన్ ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసిందని చెప్పాలి.

‘నా ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా దావోస్ కు వచ్చా. ఏపీకి చెందిన కార్యదర్శులను కలిశా. నా సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఓ పెవిలియన్ పెట్టారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఆయన ప్రతి రోజు 5-6 గంటల పాటు వివరిస్తున్నారు. నేను నా వ్యాపార అవసరాలతో పాటు రాష్ట్రానికి చెందిన వారిని కలుద్దామని పెవిలియన్ కు వెళ్లా’’ అంటూ వివరించారు. సాధారణంగా ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్న నేతలు వెళ్లిన వేళలో.. క్షణం ఆలస్యం చేయకుండా రోజుకు 16-18 గంటల వరకు వరుస భేటీలతో బిజీబిజీగా ఉంటారు.

ఎక్కడిదాకానో ఎందుకు.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్లిన వేళలో తన మనమడికి చాక్లెట్లు కొనేందుకు సైతం టైం సరిపోలేదని.. ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంలో చెప్పటం తెలిసిందే. అలాంటిది.. జగన్ లాంటి సూపర్ సీఎం దావోస్ వెళ్లినప్పుడు ఆయన రోజుకు ఐదారు గంటలు హెట్రిక్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నట్లు చెప్పిన వైనం చాలా డ్యామేజింగ్ గా మారిందంటున్నారు. విదేశాలకు పెట్టుబడుల కోసం వెళ్లినప్పుడు ఐదారు గంటలే పని చేస్తున్నట్లుగా.. ఆయన వీర విధేయుడినోటి నుంచి వచ్చిన మాట ఆయనకుచాలా డ్యామేజింగ్ అంటున్నారు. ఒకవైపు రోజువారీగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ భారీ ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నట్లుగా చేస్తున్న ప్రకటనలతో పోల్చినప్పుడు ఏపీకి వస్తున్న కంపెనీలు.. చేసుకున్న ఒప్పందాలు చాలా  తక్కువగా ఉన్నాయన్న వేళ.. పంచ్ ప్రభాకర్ లాంటి వారి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు సీఎం జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉన్నాయంటున్నారు.


Full View
Tags:    

Similar News