బాబుతో పొత్తుపై ‘చిన్నమ్మ’ కీలక వ్యాఖ్యలు

Update: 2017-03-13 04:06 GMT
కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న ఏపీ చిన్నమ్మ పురంధేశ్వరి పెదవి విప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె నోటి నుంచి కీలక వ్యాఖ్యలు ఇప్పడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యూపీలో సాధించిన విజయంతో పెరిగిన ఆత్మస్థైర్యం చిన్నమ్మ మాటల్లో స్పష్టంగా కనిపించటమే కాదు.. ఏపీలో తమ మిత్రపక్షమైన టీడీపీపై ఆమె ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు.

పంజాబ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో..తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత కానీ పెరిగితే.. ఆ పార్టీతో పొత్తు విషయంపై తాము పునరాలోచన చేసేందుకు వెనుకాడమన్న విషయాన్ని ఆమె చెప్పుకొచ్చారు. ‘‘టీడీపీపై ప్రజా వ్యతిరేకత పెరిగితే ఆ పార్టీతోపొత్తు విషయంలో పునరాలోచన చేసే అవకాశం లేకపోలేదు. పంజాబ్ లో మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వంపై ఏర్పడిన ప్రజావ్యతిరేకత మిత్రపక్షమైన బీజేపీపైనా పడింది. ఏపీ పరిస్థితి మా పార్టీ జాతీయనేతలు సమీక్షిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

ఇప్పటికైతే తాము టీడీపీకి మిత్రపక్షంగా ఉన్నామని..వచ్చే ఎన్నికల నాటికి పొత్తు విషయంపై ప్రధాని మోడీ.. పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాలు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారని చెప్పారు. మిత్రపక్షంపై ఈ తరహా వ్యాఖ్యలు చిన్నమ్మ లాంటి నేతలు చేయటం ఆసక్తికరంగా మారటమే కాదు..కమలనాథుల్లో పెరిగిన ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా చెబుతున్నారు. ఏమైనా చిన్నమ్మ మాటలు తెలుగు తమ్ముళ్లను హర్ట్ చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News