పిఠాపురం వర్మ పదవికి బ్రేకులు వేస్తున్నారుగా ?

ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పడి అయిది నెలలకు దగ్గర అవుతోంది. వర్మకు మాత్రం ఏ పదవీ అయితే దక్కలేదు.

Update: 2024-11-05 03:56 GMT

పిఠాపురం వర్మగా సోషల్ మీడియాలో ఒక దశలో మోత మోగిన ఎస్వీఎస్ఎన్ వర్మ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం టీడీపీకి వెన్ను దన్ను అయిన నాయకుడు. 2014లోనే ఆయన పార్టీని కాదని ఇండిపెండెంట్ గా గెలిచి సత్తా చూపిన వారు 2019లో వైసీపీ ప్రభంజనం లో ఓటమి పాలు అయినా 2024 ఎన్నికలకు ఆనాటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటూ వచ్చారు.

అయితే అనూహ్యంగా పిఠాపురం మీద పవన్ కన్ను పడడంతో వర్మకు భారీ షాక్ తగిలింది. అయితే మంచి హోదా ప్రభుత్వం ఏర్పడ్డాక ఇస్తామన్న టీడీపీ అధినాయకత్వం హామీ అదే విధంగా పవన్ కళ్యాణ్ సైతం వర్మకు సరైన న్యాయం చేస్తామని చెప్పిన మాటలతో రెట్టించిన ఉత్సాహంతో పవన్ విజయానికి కృషి చేశారు. అద్భుతమైన మెజారిటీ పవన్ కి వచ్చింది.

ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పడి అయిది నెలలకు దగ్గర అవుతోంది. వర్మకు మాత్రం ఏ పదవీ అయితే దక్కలేదు. ఇప్పటికి అనేక సార్లు ఎమ్మెల్సీలు అవకాశం వచ్చినా కూటమి పెద్దలు ఎవరెవరికో అవకాశాలు ఇస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవులలో ఒకటి వర ప్రసాదరావుకు, మరొకటి రామచంద్రయ్యకు ఇచ్చారు. అలాగే జనసేన వాటాలో హరిప్రసాద్ కి పదవి దక్కింది

ఆనాడూ వర్మ ప్రస్తావన కనీసంగా కూడా రాలేదు. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన అభ్యర్ధిత్వాన్ని పరిశీలించలేదు. వేరే వారికి చాన్స్ ఇచ్చారు. నామినేటెడ్ పదవులు తొలి విడతలో ఇరవై దాకా కార్పోరేషన్లు భర్తీ చేసినా వర్మ గురించే లేదు. ఇటీవల భర్తీ చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డులో వర్మకు ప్రయారిటీ ఇవ్వలేదు. అదే తూర్పు గోదావరి జిల్లా నుంచి ఇద్దరికి చాన్స్ ఇచ్చారు.

ఇక రెండవ విడత నామినేటెడ్ పందేరంలోనూ వర్మ పేరు అయితే వినిపించడం లేదు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే వర్మ సేవలను వాడుకుని వదిలేశారు అని ఆయన అభిమానులు అనుచరులు కుములుతున్నారు. వర్మ పరిస్థితి ఎలా ఉంది అంటే ఆయన నియోజకవర్గంలో టీడీపీ నేతగా ఉన్నా కూడా అక్కడ అంతా జనసేనదే హవాగా మారింది. పవన్ కళ్యాణ్ వచ్చినపుడు మాత్రం వర్మకు మర్యాద బాగానే దక్కుతోంది. కానీ ఆ తరువాతనే పట్టించుకోవడం లేదు అని అంటున్నారు.

వర్మ అంటే కష్టపడే నాయకుడు టీడీపీకి అంకితభావంతో పనిచేసే లీడర్ అని అంతా అంటారు. ఆయన నిబద్ధతకు నిజాయతీకి పదవిని ఎపుడో ఇవ్వాలి కానీ ఎందుకు బ్రేకులు పడుతున్నాయి అసలు ఎవరు బ్రేకులు వేస్తున్నారు అంటే మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. వర్మ అందరి వాడుగా ఉంటున్నారు. ఈ రోజుకీ ఆయనకు పిఠాపురం జనంలో మంచి ఆదరణ ఉంది.

ఆయనకు మంచి హోదాతో పదవి ఇస్తే బాగుంటుందని సాదర జనం అంటున్నారు. అయితే వర్మకు పదవీ యోగం ఎపుడూ అంటే ఎవరూ చెప్పలేకపోతున్నారు. వర్మ పదవికి బ్రేకులు వేస్తున్నది ఆయన బ్యాడ్ లక్ తప్ప మరేమీ కాదని అంటున్నారు. ఆయనకు టైం బాలేదేమో అని కూడా అంటున్న వారు ఉన్నారు.

అయితే వర్మ మాత్రం చంద్రబాబు మీద కోటి ఆశలే పెట్టుకున్నారు. చంద్రబాబు ఏదో నాటికి న్యాయం చేస్తారు అన్నది ఆయనకు ఈ రోజుకీ ఉంది. మరి బాబు దయ ఎపుడు వస్తుందో అపుడే వర్మకు కీలక పదవి దక్కుతుందని అంటున్నారు. అంతవరకూ వర్మ వెయిట్ చేయడమే అని అంటున్నారు.

Tags:    

Similar News