కాంగ్రెస్ కు పువ్వాడతో షాకివ్వనున్న కేసీఆర్

Update: 2016-04-24 09:56 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ష్  జరుగుతున్న తీరు ఆసక్తికరంగా మారింది. ఆపరేషన్ ఆకర్ష్ ను ఓ రేంజ్లో చేపట్టి ఒక కొలిక్కి తీసుకొచ్చిన తెలంగాణ అధికారపక్షం ఈ మధ్యన కాస్త జోరు తగ్గించింది. మరోవైపు.. ఏపీ అధికారపక్షం మాత్రం మా జోరుగా ఆపరేషన్ ఆకర్ష్ ను చేపట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అధికారపక్షం  ఊహించని షాక్ ఒకటి ఇచ్చేందుకు సిద్ధమైంది.

ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో.. ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యేని కారు ఎక్కించేందుకు నిర్ణయించింది. కొద్దికాలంగా పువ్వాడ అజయ్ కారు ఎక్కుతారని చెబుతున్నారు.. ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ స్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు వీలుగా పువ్వాడ అజయ్ కుమార్ ను పార్టీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. మొన్నటి వరకూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ మీద ఫోకస్ చేసి.. ఆ పార్టీని దాదాపుగా ఖాళీ చేయటం తెలిసిందే.

తాజాగా కాంగ్రెస్ మీద గురి పెట్టిన టీఆర్ ఎస్.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉప ఎన్నిక సమయంలో పువ్వాడను పార్టీ ఫిరాయించేలా నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ కు షాకిచ్చిందని చెప్పొచ్చు. టీఆర్ఎస్ అధినేత కమ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి వచ్చిన గ్రీన్ సిగ్నల్ తో పువ్వాడ అజయ్ కుమార్ కార్యకర్తలతో అత్యవసరంగా భేటీ అయి కారు ఎక్కే విషయం మీద చర్చలు జరిపారు. మంగళవారం పార్టీ మారాలన్న తన నిర్ణయాన్ని తన మద్దతుదారులకు వెల్లడించిన అజయ్.. తనతో పాటు ఇష్టం ఉన్న వారంతా తనతో రావొచ్చని చెప్పినట్లు తెలుస్తోంది. ఓపక్క విపక్షాల్ని ఏకం చేయటం ద్వారా టీఆర్ ఎస్ కు షాకివ్వాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంటే.. ఉప ఎన్నిక జరుగుతున్న జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేని కారు ఎక్కించటం ద్వారా మైండ్ బ్లాక్ అయ్యే నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News