గ్రూపు 1 ప‌రీక్ష‌లోనూ గ‌వ‌ర్న‌మెంటు సర్వేనా?

Update: 2016-09-15 09:23 GMT
ఏపీ ప్ర‌భుత్వ తీరుపై నిరుద్యోగులు - యువ‌త నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌భుత్వోద్యోగాల‌కు నిర్వ‌హించే ప‌రీక్ష‌ల్లోనూ ప్ర‌జాభిప్రాయం తెలుసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. తాజాగా నిర్వ‌హించిన గ్రూప్ 1 ప‌రీక్షే అందుకు ఉదాహ‌ర‌ణ అని చెబుతున్నారు. 2011 గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలను బుధవారం ఏపీపీఎస్సీ నిర్వహించింది. మొత్తం 3,128మంది పరీక్షలు రాశారు. అంతా బాగానే ఉన్నా ప‌రీక్ష‌ల్లో అడిగిన రెండు ప్ర‌శ్న‌ల‌పై మాత్రం చాలామంది ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు.  “కేంద్రం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది. కానీ హోదా ఇవ్వలేదు. ప్రస్తుత ప్యాకేజీతో పోలిస్తే హోదా వల్ల ఎక్కువ ప్రయోజనాలుంటాయా?.” అన్న ప్ర‌శ్న ఇచ్చి దానికి వ్యాస‌రూప స‌మాధానం కోరారు. అలాగే పట్టిసీమ వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రించ‌మ‌ని అడిగారు.

నిజానికి ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం రాయ‌డం అభ్యర్థుల‌కు ఇబ్బందేమీ కాదు. కానీ... వ‌చ్చిన చిక్కంతా ప్ర‌భుత్వ అభిప్రాయాల‌తో సంబంధ‌మున్న అంశాలు కావ‌డంతో ఏం రాస్తే మార్కులు వేస్తారు ఏం రాస్తే వేయ‌ర‌న్న‌దే. ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా రాసేస్తే మార్కులేస్తారు.. లేక‌పోతే వేయ‌ర‌ని అభ్య‌ర్థులు అంటున్నారు.

కొద్దికాలంగా న‌లుగుతున్న ప్ర‌త్యేక హోదా విష‌యంలో ముఖ్యమంత్రి చంద్రబాబే స్యయంగా హోదాకన్నా ప్యాకేజే బెటర్‌ అని చెప్పారు. ప్రధానికి ధన్వవాదాలు తెలిపారు. ఇకేంముంది?. ప్యాకేజ్‌ కు మించింది ఏదో చెప్పండి కేంద్రంపై పోరాడుతా అని అన్నారు.అదే సమయంలో వైసీపీతో పాటు ఇతర పార్టీలు హోదాయే కావాలని ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాయి. పార్టీల మధ్య అభిప్రాయబేదాలున్నట్టుగానే పరీక్షలు రాసిన వారికీ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. ఎవ‌రి వాద‌న‌కు అనుగుణంగా వారి వ‌ద్ద బ‌ల‌మైన పాయింట్లుంటాయి. ఇప్పుడు ప్యాకేజ్ కంటే హోదా వల్ల ఎక్కువ ప్రయోజనాలున్నాయని జవాబు పత్రంలో గట్టిగా వాదిస్తూ రాసిన వారికి ఎక్కువ మార్కులు వేస్తారా?… లేదంటే  చంద్రబాబు - ఆయన అనుకూల వాదులు చెబుతున్న‌ట్లుగా ప్యాకేజే బెటర్ అన్నట్టుగా జవాబు రాసిన వారికి ఎక్కువ మార్కులు వేస్తారా అన్నది తెలియాలి. దీంతో అభ్య‌ర్థులు త‌మ‌కు తెలిసిన వాస్త‌వాల‌ను రాయాలా లేదంటే చంద్ర‌బాబుకు న‌చ్చేలా రాయాలా అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

అలాగే “పట్టిసీమ వల్ల ప్రయోజనాలు వివరించండి?” అన్న ప్ర‌శ్న‌కూ పాజిటివ్ గా, నెగ‌టివ్ గా కూడా రాయొచ్చు.  పట్టీసీమ వల్ల రాయలసీమ రతనాల సీమ అవుతుందని, ఏపీలో కరువే ఉండదని చంద్ర‌బాబు చెబుతున్న‌ట్లుగా రాయ‌డం ఒక కోణ‌మైతే..  పట్టిసీమ పూర్తయినా ఇప్పటికీ రాయలసీమకు చుక్క నీరును కూడా అదనంగా శ్రీశైలం నుంచి అందించలేకపోవడాన్ని హైలైట్ చేస్తూ రాయ‌డం రెండో కోణం.  దీంతో ఈ రెండు ప్ర‌శ్న‌లు త‌మ‌ను చాలా ఇబ్బంది పెట్టాయ‌ని అభ్య‌ర్థులు అంటున్నారు. అంతేకాదు... ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల ఆధారంగా టీడీపీ అనుకూల ఆలోచ‌న‌లు ఉన్న అభ్య‌ర్థుల‌ను గుర్తించి ఉద్యోగాలు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం అనుకుంటోంద‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News