హైదరాబాద్ శాస్త్రవేత్తలు తయారు చేసిన విధానంతో అరగంటలోనే రిజల్ట్

Update: 2020-06-12 00:30 GMT
మాయదారి రోగాన్ని నిర్ధారించేందుకు అనుసరిస్తున్న పరీక్షా విధానం ఖరీదైనది. ఈ కారణంతోనే పెద్ద ఎత్తున నిర్దారణ పరీక్షలు నిర్వహించేందుకు వెనుకా ముందు ఆడుతున్నాయి ప్రభుత్వాలు. దీనికి తోడు మరో సమస్య కూడా ఉంది. ఈ రోజు పరీక్ష చేసి.. నెగిటివ్ అని తేలినా.. వారం తర్వాత పరీక్ష చేస్తే పాజిటివ్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఈ కారణంతోనే.. లక్షణాలు ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే.. ఈ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటివేళ.. హైదరాబాద్ కు చెందిన శాస్త్రవేత్తలు తక్కువ ఖర్చుతో.. కేవలం అరగంట వ్యవధిలోనే ఫలితం తేలేలా ఒక పరీక్షా విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అయితే.. ఇందుకు అధికారిక అనుమతులు రావాల్సి ఉంది. ఇంతకూ వారు తయారు చేసిన విధానం ఏమిటి? అందుకు అయ్యే ఖర్చు ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే..

ఎర్రగడ్డలోని ఈఎస్ఐ వైద్య కళాశాలతో పాటు హైదరాబాద్ లోని టాటా పరిశోధన సంస్థ సహకారంతో ఈ కొత్త పరీక్షను అందుబాటులోకి తీసుకొచ్చారు. రివర్స్ ట్రాన్స్ క్రిప్టేజ్ - లూప్ మీడియేటెడ్ ఐసోథర్మల్ ఆంప్లిఫికేషన్ సింఫుల్ గా చెప్పాలంటూ ఆర్ టీ -లాంప్ అనే పరీక్షా విధానాన్ని ఆవిష్కరించారు.

ఇప్పుడు ఉన్న విధానంలో మాయదారి రోగ నిర్దారణకు శాంపిల్స్ సేకరించిన తర్వాత ఫలితాలు రావటానికి 12 నుంచి 24 గంటల సమయం పడుతోంది. దగ్గర దగ్గర రూ.4500 ఖర్చు అవుతుంది. ఈ లెక్క తేల్చేందుకు అత్యాధునిక ప్రయోగశాల అవసరం ఉంది.

ఇందుకు భిన్నంగా ఆర్ టీ లాంప్ విధానంలో కేవలం రూ.300 మాత్రమే ఖర్చు కావటంతో పాటు.. సాధారణ వసతులున్న ప్రయోగశాలల్లోనూ కొన్ని జాగ్రత్తలతో నిర్వహించే వీలుందని చెబుతన్నారు. ఈ విధానంలో పసుపు రంగులో ఫలితం వస్తే పాజిటివ్ అని.. గులాబీ రంగులో వస్తే నెగిటివ్ అని చెబుతున్నారు. అయితే.. ఈ పరీక్షా విధానానికి భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నుంచి అనుమతి రావాల్సి ఉంది. అది వస్తే.. పరీక్షలు ప్రారంభించే వీలుంది. ఒకవేళ.. ఐసీఎంఆర్ కానీ ఈ విధానానికి ఓకే చెబితే.. నిర్దారణ పరీక్షలు మరింత సులువు కావటంతో పాటు.. పాజిటివ్ కేసుల మీద క్లారిటీ వచ్చే వీలుంది.
Tags:    

Similar News