కేసీఆర్ ప్ర‌ధాని కావాలి: ఆర్.నారాయ‌ణ మూర్తి

Update: 2017-12-19 06:54 GMT
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సోమ‌వారం నాడు జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య‌ టాలీవుడ్ కు చెందిన సినీతారలు భారీగా హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఆ స‌ద‌స్సుకు హాజ‌రైన సీనియ‌ర్ న‌టుడు ఆర్. నారాయ‌ణ మూర్తి ఉద్వేగభూరిత ప్ర‌సంగం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ మ‌హాస‌భ‌ల‌కు హాజ‌ర‌వ‌డం మహా భాగ్య‌మ‌ని అన్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్ పై నారాయ‌ణ మూర్తి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. కోట్లాదిమంది ప్ర‌జ‌లు చూస్తుండ‌గా ఆయ‌న గురువుకు పాదాభివంద‌నం చేసిన తెలంగాణ రాజు కేసీఆర్ కు శిర‌సు వంచి పాదాభివంద‌నం చేస్తున్నానని స‌భాముఖంగా చెప్పారు. తెలుగును పాశ్చాత్య పోక‌డ‌లు - సంప్ర‌దాయాలు ఖూనీ చేస్తున్నటువంటి ఈ రోజుల్లో....ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇంగ్లిషు భాష రాజ్య‌మేలుతున్న రోజుల్లో ప్ర‌పంచ తెలుగు మహాస‌భ‌ల‌ను హైద‌రాబాద్ లో నిర్వ‌హిస్తున్నందుకు కేసీఆర్ గారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. 1 నుంచి 12వ త‌ర‌గతి వ‌ర‌కు ప్ర‌భుత్వ‌ - ప్రైవేటు స్కూళ్ల‌లో తెలుగును త‌ప్ప‌ని స‌రి చేస్తూ తెలుగు భాష ప‌రిర‌క్ష‌ణ‌కు భాషాభిమాని కేసీఆర్ చేస్తున్న కృషి అమోఘ‌మ‌న్నారు. ఇప్ప‌టికైనా తెలుగు ప్ర‌జ‌లు మేల్కొన‌క‌పోతే.....రాబోయే వందేళ్ల‌లో తెలుగు భాష‌ను మ్యూజియాల‌లో వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌న్నారు.

లీడ‌ర్ ఆఫ్ ది ఈయ‌ర్ అవార్డుకు ఎంపికైన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను నారాయ‌ణ మూర్తి ఆకాశానికెత్తేశారు. ఈ ఒక్క సంవ‌త్స‌రానికే ఆయ‌న లీడ‌ర్ ఆఫ్ ది ఈయ‌ర్ కాద‌ని....రాబోయే సంవ‌త్స‌రాల్లో కూడా ఆ అవార్డు ఆయ‌న‌కే ద‌క్కుతుందని అన్నారు. ఆయ‌న తండ్రికి త‌గ్గ త‌న‌యుడ‌ని నిరూపించుకున్నార‌న్నారు. హైద‌రాబాద్ లో పేకాట క్ల‌బ్బుల‌ను కేసీఆర్ మూసివేయించిన‌ట్లుగానే ప‌బ్బులు - హ‌బ్ లను మూసివేయాల‌ని - వాటి ద్వారా యువ‌త నిర్వీర్య‌మైపోతోంద‌ని కేటీఆర్ కు విజ్ఞ‌ప్తి చేశారు. రాజ‌కీయాల్లో ఉత్త‌రాది వారి పెత్త‌నం - భాష‌ల్లో హిందీ భాష పెత్త‌నం పోయి....ద‌క్షిణాది వారి వాణి ఉత్తరాదిలో వినిపించాలంటే భ‌విష్య‌త్తులో కేసీఆర్....ప్ర‌ధాన మంత్రి ప‌ద‌విని అధిష్టించాల‌ని ఆకాంక్షించారు. కాంగ్రెస్ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టి  - తెలుగు జాతి ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా వ్యాప్తి చేసిన‌ ఎన్టీఆర్ లో ఉన్న మొండితనం - మడమ తిప్పనితనం - పి.వి.నరసింహారావులా ఎత్తుకు పైఎత్తు వేసే లక్షణం - వెంకయ్యనాయుడు లాంటి వాక్‌ చాతుర్యం క‌ల‌గ‌లిపిన నేత కేసీఆర్ అని నారాయణమూర్తి అన్నారు. పేద‌వాళ్లు కూడా.... ఇంజ‌నీర్లు - డాక్ట‌ర్లు - ఐఏఎస్  - ఐపీఎస్ కావాల‌ని - దానికోసం కేజీ టు పీజీ విద్య‌లో తెలుగుతో పాటు ఇంగ్లిషు భాష‌ను కూడా బోధించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.


Tags:    

Similar News